సర్వేల పేరుతో సర్వం మాయ ! జిమ్మిక్కులు ఇవే !  

Political Parties Tricks On Elections Survey-

ప్రస్తుతం ఎక్కడ చూసినా ఎన్నికల సందడి కనిపిస్తోంది. నాయకులు ఎన్నికల ఫీవర్ తో సతమతం అయిపోతున్నారు. సందట్లో సడేమియాలా … అనేక సర్వే సంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. ఎవరికి వారు తమదైన స్టైల్ లో ప్రజల్లోకి వెళ్లి రాజకీయ పార్టీల గురించి , నాయకుల గురించి ప్రజలను రకరకాల ప్రశ్నలు అడుగుతూ… పార్టీలపై , నాయకులపై ప్రజల అభిప్రాయం ఇదే ! మేము చేసిన సర్వేకి ఇక తిరుగులేదు అంటూ హడావుడి చేస్తుంటాయి. ఇక లెక్కకు మించి ఉన్న టీవీ ఛానెల్స్ కూడా...

సర్వేల పేరుతో సర్వం మాయ ! జిమ్మిక్కులు ఇవే !-Political Parties Tricks On Elections Survey

అదే పనిగా తమకు అనుకూలమైన పార్టీలకు బాకా ఊదడమే కాకుండా సర్వేల పేరుతో అవి కూడా హడావుడి చేస్త్తున్నాయి. అంటే సర్వేల్లో రెండు రకాలు ఉన్నాయన్నమాట ఒక నిక్ష్పక్షపాతంగా సర్వే చేయడం ఒకటి అయితే.

పార్టీల దగ్గర , నాయకుల దగ్గర డబ్బులు తీసుకుని దానికి అనుగుణంగా. వారికి అనుకూలంగా రిజల్ట్ ఉండేలా సర్వే రిపోర్ట్ తయారుచేయడం రెండవది.

సర్వే ఫలితాలు అనుకూలంగా ఉంటే వచ్చే ఆ కిక్కే వేరు అందుకే నాయకులు కూడా డబ్బులు ఖర్చయినా ఫర్వాలేదు అనుకుంటూ తమకు అనుకూల సర్వేలు చేయించుకుంటున్నారు. అనుకూల నివేదికలతో ప్రజలను మభ్యపెడుతూ అధిష్టానాలను ఆకర్షించాలని చూస్తున్నారు. తమ పార్టీలోని ప్రత్యర్థులు, ఇతర పార్టీల్లో ప్రధాన నాయకులను లక్ష్యంగా చేసుకుంటూ సర్వేలు చేయించుకోవడం ఇటీవల బాగా ఎక్కువయ్యింది.

ప్రజల్లో తమకే బలం ఎక్కువ ఉందని, తమకు టికెట్ ఇస్తే ఇక తిరుగే ఉండదు అన్నట్టు పార్టీ అధిష్టానం దగ్గర మార్కులు కొట్టేసేందుకు ప్రయత్నిస్తున్నారు...

ఈ సర్వే కోసం నాయకులు దాదాపు అయిదు నుంచి పది లక్షల వరకు ఖర్చుపెట్టేందుకు సైతం వెనకాడడం లేదు. తమకు కావాల్సిన పారామీటర్లను ముందుగానే నిర్దేశిస్తున్నారు. బీసీ, ఎస్సీ లు, అగ్రవర్ణాల వారీగా క్లాసిఫైడ్ సర్వేలు, యాధృచ్ఛిక రాండమ్ సర్వేలు, వయో , వృత్తి వర్గాల వారీగా సైతం సర్వే ఫలితాలను తెలుసుకుంటున్నారు.

తమకు ఏయే వర్గాల్లో ఎడ్జ్ కావాలో ముందుగానే చెప్పేస్తున్నారు. దానికి అనుగుణంగానే సర్వే ఫలితాలను ఆయా సంస్థలు అందిస్తున్నాయి...

మరికొంతమంది ఈ సర్వే ఫలితాలను అడ్డం పెట్టుకుని నాయకులు పార్టీలను టికెట్ కోసం డిమాండ్ చేస్తుండగా పార్టీలకు కూడా సర్వేలు రక్షణ కవచంగా ఉపయోగపడుతున్నాయి.

ప్రధానమైనపార్టీల తరఫున నియోజకవర్గాల్లో అనేక మంది పోటీ పడుతున్నారు. తమకే టిక్కెట్లు ఇవ్వాలంటూ అధిష్టానాల వద్ద డిమాండ్లు పెడుతున్నారు. దీనికి పరిష్కారంగా, ప్రత్యామ్నాయంగా పార్టీలు కనిపెట్టిన రక్షణ కవచం సర్వేలు.

అభ్యర్థులు గెలుపు అవకాశాలపై సర్వేలు నిర్వహిస్తున్నట్లు పార్టీలు ప్రకటిస్తున్నాయి. ప్రజల్లో ఎక్కువ ఆదరణ వ్యక్తమైన వారికే టిక్కెట్లు కేటాయిస్తామంటూ పార్టీ నాయకులు చెబుతున్నారు. తమకు కావాల్సిన అభ్యర్థులకు టిక్కెట్లు ఇచ్చేందుకు అడ్డు లేకుండా చూసుకునే ఎత్తుగడ ఈ సర్వేల ద్వారా అమలు చేస్తున్నారు.