టీడీపీ మాజీ మంత్రికి వైసీపీ ఎంపీ టికెట్‌..!     2018-05-01   03:35:50  IST  Bhanu C

ఆయ‌న టీడీపీలో చాలా త‌క్కువ టైంలోనే కీల‌క‌మైన నేత‌గా మారారు. పార్టీ అధినేత చంద్ర‌బాబుకు చాలా స‌న్నిహితంగా మెలిగారు. ఈ నేప‌థ్యంలోనే రాజ‌కీయాలకు కొత్తే అయినా.. చంద్ర‌బాబు ఆయ‌న‌కు నేరుగా మంత్రి ప‌ద‌వి క‌ట్ట‌బెట్టారు. అయితే వ‌రుస‌గా ఆయ‌న వివాదాల్లో చిక్కుకున్న‌ వైనం స‌ద‌రు మంత్రి వ‌ర్యుల‌కు తీవ్ర స‌మ‌స్య‌గా ప‌రిణ‌మించింది. ఫ‌లితంగా ఆయ‌న మంత్రి ప‌ద‌వినే పోగొట్టుకున్నారు. ఆయ‌నే గుంటూరు జిల్లా ప్ర‌త్తిపాడు నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన రావెల కిషోర్ బాబు. గత ఏడాది ఏప్రిల్‌లో జ‌రిగిన‌మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌లో ఆయ‌నకు చంద్ర‌బాబు హ్యాండిచ్చారు. దీంతో అప్ప‌టి నుంచి రావెల తీవ్ర మ‌న‌స్థాపంతో ఉన్నారు. ద‌ళిత వ‌ర్గానికి చెందిన ఆయ‌న మ‌ళ్లీ పూర్వ వైభ‌వం కోసం ఎంత ప్ర‌య‌త్నించినా ఫ‌లితం లేకుండా పోయింది.

ప్ర‌స్తుతం ప్ర‌త్తిపాడులో ఉన్న ప‌రిణామాల‌ను బ‌ట్టి చూస్తే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు టీడీపీ నుంచి అసెంబ్లీ టికెట్ కూడా ల‌భించే అవ‌కాశం క‌నిపించ‌డం లేదు. దీంతో రావెల వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి విప‌క్షం వైసీపీలో చేరాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ని వార్త‌లు గ‌త ఆరేడు నెల‌లుగానే వినిపిస్తున్నాయి. అయితే, ఈ ద‌ఫా అసెంబ్లీకి కాకుండా గుంటూరు జిల్లా బాప‌ట్ల పార్ల‌మెంటు ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేయాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలుస్తోంది. ఇప్ప‌టికే జ‌గ‌న్‌కు స‌న్నిహితంగా కొంద‌రు పార్టీ నేత‌ల ద్వారా ఈ విష‌య‌మై చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయ‌ని టాక్‌.