రాజీనామా చేసి వైకాపా ఎంపీలు తప్పించుకున్నారు.. లేదంటే  

వైకాపా ఎంపీలు ఇటీవలే తమ పార్లమెంటు సభ్యత్వంకు రాజీనామా చేసిన విషయం తెల్సిందే. గత పార్లమెంటు సమావేశాల అనంతరం రాజీనామా చేసిన వైకాపా ఎంపీల రాజీనామాలను తాజాగా స్పీకర్‌ ఆమోదించడం జరిగింది. స్పీకర్‌ ఆమోదం పొందినప్పటికి ఉప ఎన్నికలు వచ్చే అవకాశం లేదు. ఉప ఎన్నికలు లేక పోవడంతో వైకాపా మాజీ ఎంపీలు కాస్త రిలాక్స్‌ అయ్యారు. ఇక వైకాపా ఎంపీలు రాజీనామా చేయడంతో పెద్ద చిక్కు నుండి కూడా తప్పించుకున్నారు. తాజాగా తెలుగు దేశం పార్టీ తీసుకు వచ్చిన అవిశ్వాస తీర్మానంపై వైకాపా ఎంపీలు అటా ఇటా అన్నట్లుగా ఉండాల్సి వచ్చేది. ఇప్పుడు రాజీనామా చేయడం వల్ల ఎటూ లేకుండా ప్రశాంతంగా ఉండవచ్చు.

వైకాపాకు ప్రస్తుతం లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంలో పాలు పంచుకునే అవకాశం లేదు. ఒక వేళ ఉండి ఉంటే ఖచ్చితంగా మోడీపై చంద్రబాబు నాయుడు పెట్టిన అవిశ్వాస తీర్మానంకు మద్దతు ఇవ్వాల్సి వచ్చేది. ఒక వేళ మోడీకి మద్దతు ఇస్తే రాష్ట్ర ప్రయోజనాలను కాలరాసి జగన్‌ బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు అంటూ చంద్రబాబు నాయుడు అండ్‌ టీం ప్రచారం చేసే అవకాశం ఉంది. అందుకే జగన్‌ పార్టీ ఎంపీలు రాజీనామా చేయడంతో పెద్ద చిక్కుముడిని తప్పించుకున్నారు అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

రాజ్యసభలో వైకాపా ఎంపీు ఉన్నప్పటికి వారు బీజేపీకి అనుకూలంగా ప్రవర్తించిన ఎలాంటి ప్రభావం ఉండదు. వచ్చే ఎన్నికల తర్వాత బీజేపీతో పొత్తు కోరుకుంటున్న జగన్‌ ఖచ్చితంగా ఏపీలో కూడా బలమైన నాయకుడిగా అవతరించి సీఎం అవ్వాలని కలలు కంటున్నాడు. ఈ పరిణామాలతో జగన్‌ పార్లమెంటులో బీజేపీకి అనుకూలంగా వ్యవహరించడం జరిగితే ఏపీలో టీడీపీ కట్టలు తెంచుకునేలా జనాలను రెచ్చగొట్టడం జరుగుతుంది. అందుకే వైకాపా సభ్యులు రాజీనామా చేసి మంచి పని చేశారు అంటూ ఇప్పుడు వైకాపా కార్యకర్తలు అంటున్నారు.

తెలుగు దేశం పార్టీ పెట్టే అవిశ్వాసంకు మద్దతు ఇవ్వనక్కర్లేదు, మోడీకి వ్యతిరేకంగా ఉండనక్కర్లేదు. జగన్‌ ఎంపీలు లేక పోవడంతో మ్యాజిక్‌ ఫిగర్‌ మోడీకి తగ్గుతుంది. అంటే తక్కువ ఎంపీలతోనే అవిశ్వాసంను నెగ్గే అవకాశం ఉంటుంది. అందుకే జగన్‌కు రహస్యంగా మోడీ అండ్‌ అమిత్‌షాలు కృతజ్ఞతలు చెప్పే అవకాశం ఉంది.