మన పార్టీలోకి వచ్చేయ్ ! కొణతాలను బతిమిలాడుతున్న వైసీపీ    2018-05-29   01:05:21  IST 

ఆరు నూరైనా .. నూరు.. నూట యాభై అయినా ఈ సారి ఎలాగైనా పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అందుకు అంది వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకునేందుకు ఇష్టపడడంలేదు. అందుకే ఒక మెట్టు దిగి మరీ… పార్టీ వీడిన వారిని బుజ్జగించి పార్టీలోకి తీసుకొచ్చేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. అలాగే పార్టీపై అసంతృప్తి ఉండి అంటీ ముట్టనట్టుగా ఉంటున్న వారిని కూడా జో కొడుతున్నారు. ప్రస్తుతం వైసీపీ అధినేత ప్రజాసంకల్ప యాత్రలో బిజీగా ఉండడంతో విజయసాయిరెడ్డి పనులు చక్కబెడుతున్నారు. కొణతాల విషయంలో మాత్రం ఏకంగా జగన్ తల్లి విజయమ్మ రంగంలోకి దిగారు.

జగన్ పార్టీ పెట్టినప్పటి నుంచి కొణతాల అయన వెంటే నడిచారు. ఉత్తరాంధ్ర జిల్లాలో బలమైన నాయకుడిగా ఉన్న కొణతాల కాంగ్రెస్ నేత బొత్ససత్యనారాయణ వైసీపీలోకి రావడంతో పార్టీ నుంచి బయటకి వెళ్లిపోయారు. దీంతో ఇప్పుడు ఎన్నికల హడావుడి మొదలవ్వడంతో … తాజాగా వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కన్నబాబు రాజు ద్వారా రామకృష్ణను తిరిగి తెచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు విజయమ్మ .