వైసీపీలో ఈ గ్రూపుల గోల ఏంటి..? లుకలుకలు మొదలయ్యాయి !  

గ్రూపు విబేధాలు అనేవి రాజకీయ పార్టీల్లో సర్వ సాధారణం అయినప్పటికీ .. అవి మరీ శృతిమించితే పార్టీకి ఇబ్బందే . ఒక్కసారి పార్టీ పుట్టి ముంచేయడానికి కూడా ఇవే కారణం అవుతాయి. అందుకే ఆదిలోనే ఆ గ్రూప్ ల గోల లేకుండా ఉండేలా పార్టీలు చూసుకుంటూ ఉంటాయి. ఇప్పుడు ఇలాంటి గ్రూప్ తగాదాలు వైసీపీ లో మరీ శృతిమించిపోయాయి. పార్టీని అధికారం వైపు తీసుకెళ్లేందుకు జగన్ పాదయాత్ర చేస్తున్నాడు. నాయకులందరినీ సమన్వయం చేసుకుంటూ ఉండును వెళ్తున్నాడు. అయితే జగన్ పాదయాత్ర చేస్తున్న తూర్పు గోదావరి జిల్లాలోనే ఇప్పుడు ఈ తగాదాలు ఎక్కువయ్యాయి. ప్రతి నియోజకవర్గంలో ఇద్దరు ముగ్గురు నాయకులకు పార్టీ బాధ్యతలు అప్పగించడంతో ఈ గొడవలు మరింత అదిరిపోయాయి.

రాజకీయంగా సెంటిమెంట్‌ జిల్లాగా పేరొందిన తూర్పు గోదావరిలో రాజమహేంద్రవరం, అనపర్తి, రామచంద్రపురం తదితర నియోజకవర్గాల్లో జగన్‌ పర్యటనకు ముందే గ్రూపు తగాదాలు పతాకస్థాయికి చేరాయి. జిల్లా కేంద్రం కాకినాడ సిటీ, రూరల్‌ అసెంబ్లీ నియోజకవర్గాల్లో అసమ్మతినేతల పరిస్థితి మరింత చర్చనీయాంశంగా మారింది. కీలకమైన కాకినాడ సిటీ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి పెత్తనాన్ని మాజీమంత్రి ముత్తా గోపాలకృష్ణ వర్గం పంతమాత్రం జీర్ణించుకోలేకపోతోంది. ఈ నేపథ్యంలో జగన్‌ ప్రజాసంకల్ప యాత్ర సాక్షిగా పార్టీలో గ్రూపు విభేదాలు పతాకస్థాయికి చేరాయి.

రాజకీయంగా కీలకమైన కాకినాడ నగరంలో పార్టీ సమన్వయకర్త, నగర అధ్యక్షుడు నియామకాల విషయంలో అధిష్ఠానం వ్యవహరించిన అనుచిత వైఖరే ఇందుకు ప్రధాన కారణమని పార్టీ కార్యకర్తలు వాపోతున్నారు. ఇటీవలికాలంలో ఒకరి తర్వాత ఒకరిని అధ్యక్షులుగానూ, సమన్వయ కర్తలుగానూ మార్చి పార్టీలో గ్రూపులను ప్రోత్సహించడంలో కొందరునేతలు విజయం సాధించారని విమర్శిస్తున్నారు. కాకినాడ నగర వైకాపా సమన్వయకర్తగా గతంలో మాజీమంత్రి ముత్తా గోపాలకృష్ణ తనయుడు శశిధర్‌ను నియమించారు. అనంతరం శశిధర్‌ స్థానంలో కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డిని కో-ఆర్డినేటర్‌గా నియమించారు.

ఈ పరిణామం ముత్తా వర్గానికి తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది. ప్రస్తుతం చంద్రశేఖరరెడ్డి అంతా తానై పార్టీలో చక్రం తిప్పేందుకు ప్రయత్నిస్తుంటే, ముత్తా వర్గం మాత్రం తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నట్టు తెలుస్తోంది. ఇదే అదనుగా ముత్తా జనసేనలో చేరే అవకాశం ఉన్నట్టు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. ఇదిలావుంటే కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ నుండి వైసీపీ తీర్ధం పుచ్చుకున్న కంపర రమేష్‌కు నగర అధ్యక్ష బాధ్యతలను అప్పగించారు. ఈయన పదవీ ప్రమాణ కార్యక్రమానికి పలువురు రాష్ట్ర స్థాయి వైసీపీ నేతలు హాజరయ్యారు. ఆ తరువాత కంపరను అధ్యక్ష పదవి నుండి తొలగించి పార్టీకి చెందిన మరోనేత ఫ్రూటీకుమార్‌ను అధ్యక్షుడిగా నియమించడం సర్వత్రా చర్చనీయాంశమయ్యింది. ఈ పరిణామానికి కంపర తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నట్టు సమాచారం!

ఇదిలావుండగా సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కాకినాడ సిటీ అసెంబ్లీ సీటు కేటాయింపును దృష్టిలో ఉంచుకుని అర్ధంతరంగా ద్వారంపూడిని కో-ఆర్డినేటర్‌గా నియమించారని పార్టీశ్రేణులు చెబుతున్నాయి. ఇక కాకినాడ రూరల్‌ నియోజకవర్గంలో గతంలో సమన్వయకర్తగా పనిచేసిన చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణను రామచంద్రపురం సమన్వయకర్తగా నియమించడాన్ని అక్కడి కేడర్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.