ఏపీ పాలిటిక్స్‌లో ఆ ముగ్గురి కుమ్మ‌క్కు పాలిటిక్స్‌    2018-06-25   05:13:24  IST  Bhanu C

ఏపీకి ప్ర‌త్యేక హోదా క్రెడిట్ గేమ్‌లో మూడు పార్టీలు కుమ్మ‌క్కు అయ్యాయా..? రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌ను ప‌క్క‌న బెట్టి కేవలం చంద్ర‌బాబునే టార్గెట్‌ చేశాయా..? వ‌చ్చే ఎన్నిక‌ల్లో వేర్వేరుగా బ‌రిలోకి దిగితే బాబు ముందు ఓడిపోతామ‌నే ఆలోచ‌న‌కు వ‌చ్చాయా..? అంటే తాజా ప‌రిణామాలు మాత్రం నిజ‌మేన‌ని చెబుతున్నాయి.. టీడీపీ అధినేత‌, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబును ఎదుర్కొనేందుకు బీజేపీ, వైసీపీ, జ‌న‌సేన‌లు ర‌హ‌స్య ఒప్పందానికి దిగి ఉండ‌వ‌చ్చున‌నే అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.. తిరుప‌తి మాజీ ఎంపీ, వైసీపీ నేత వ‌ర‌ప్ర‌సాద్ చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు ఆ మూడు పార్టీల మ‌ధ్య ఉన్న అవ‌గాహ‌న‌ను ప్ర‌జ‌ల ముందు ఉంచుతున్నాయి. రానున్న ఎన్నిక‌ల్లో జ‌నసేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ వైసీపీకి మ‌ద్ద‌తు తెలిపే అవ‌కాశం ఉంద‌ని ఆయ‌న చెప్ప‌డంలో ఆంత‌ర్య‌మిదేన‌ని ప‌లువురు నాయ‌కులు అంటున్నారు.

బీజేపీ, వైసీపీ, జ‌న‌సేనల మ‌ధ్య అవ‌గాహ‌న కుద‌రింద‌ని చెప్ప‌డానికి అనేక అంశాలు ఉన్నాయ‌ని చెప్పొచ్చు. రెండు నెల‌ల కింద‌ట విజ‌య‌వాడ‌కు వ‌చ్చిన కేంద్ర మంత్రి రాందాస్ అథ‌వాలె మాట్లాడుతూ..ఏపీలో జ‌గ‌న్ బ‌లమైన నాయ‌కుడంటూ పొగిడారు. ఇదే స‌మ‌యంలో ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌కుండా న‌మ్మ‌క‌ద్రోహం చేసిన బీజేపీని, ప్ర‌ధాని మోడీని క‌నీసం మారుమాట కూడా అన‌కుండా జ‌గ‌న్ ఉంటున్నారు. హోదా కోసం పోరాడుతున్న ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుపై మాత్రం తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డుతున్నారు. టీడీపీకి వ్య‌తిరేకంగా వైసీపీ నేత‌లు కార్య‌క్ర‌మాలు చేప‌ట్ట‌డం.. అంతేగాకుండా.. ఆ పార్టీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ప్ర‌ధాని కార్యాల‌యం చుట్టూ చ‌క్క‌ర్లు కొట్ట‌డం.. ఏకంగా స‌భ‌లో ప్ర‌ధాని మోడీ కాళ్లు మొక్క‌డం గ‌మ‌నార్హం. ఇవ్వ‌న్నీ కూడా బీజేపీ, వైసీపీల అవ‌గాహ‌నకు నిద‌ర్శ‌నాలేన‌నే టాక్ ఉంది.