వైసీపీ గాలి వీస్తోందా.. ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే..  

ఎన్నికల సందడి ఏపీలో మొదలవ్వడంతో ఇప్పుడు ఏ రాజకీయ పార్టీకి ఎంత బలం ఉంది .. ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలిచే అవకాశం ఉంది అనే విషయాలు చర్చకు వస్తున్నాయి. ముఖ్యంగా ఏపీ ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధికారం కోసం ఎప్పటి నుంచో తహ తహలాడుతూ ఉంది. ఆ పార్టీ అధినేత జగన్ ఎప్పుడూ ప్రజల్లోనే తిరుగుతూ పార్టీపై ప్రజల్లో అభిమానం పెరిగేలా తంటాలు పడుతున్నాడు. జగన్ కు పోటీ అన్నట్టుగా జనసేన అధినేత పవన్ కూడా యాత్ర చేస్తూ ఓట్ల కోసం తంటాలు పడుతుంటే , అధికార పార్టీ టీడీపీ అనేక ప్రజాకర్షక పథకాలతో ప్రజలను ఆకట్టుకునేందుకు చూస్తోంది. ఈ ముక్కోణపు పోటీలో విజయం ఎవరిని వరిస్తుందో అన్న టెన్షన్ అన్ని పార్టీల్లోనూ కనిపిస్తోంది.

ఇప్పుడు ఒక రకంగా చెప్పుకుంటే.. రాబోయే ఎన్నికలు వైసీపీకి ఒక అగ్ని పరీక్షే. జగన్ ను ఏ మేరకు ప్రజలు నమ్ముతారు, ఆయనకు సీట్లు ఎంతవరకు వస్తాయి అనేది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. ముఖ్యంగా గోదావరి జిల్లాలో గత ఎన్నికల్లో ఆ పార్టీ చాలా స్థానాల్లో ఓటమి పాలవడంతో ప్రస్తుతం అక్కడ యాత్ర చేస్తున్న జగన్ వాటిపై మరింత దృష్టి పెట్టారని, మంచి పట్టున్న గెలుపు గుర్రాలని ఆయా ప్రాంతాల్లో అభ్యర్థులుగా నిలబెట్టేందుకు చూస్తున్నారు. గత ఎన్నికల్లో తొలిసారిగా బరిలో నిలిచిన వైసిపి ఫర్వాలేదు అనే స్థాయిలోనే సీట్లు సంపాదించుకుంది. పైగా ఆ సమయంలో టీడీపీ, జనసేన, వామపక్షలు అన్నీ కూడా కూటమిగా ఏర్పడి జగన్ ఓటమికి కొంత కారణమయ్యాయి.

అధికార పార్టీ టీడీపీ మీద ప్రజల్లో చాలా ఆగ్రహం కనిపిస్తోంది. ఏపీకి హోదా విషయంలో టీడీపీ నాటకాలాడిందని, నాలుగేళ్లపాటు బీజేపీతో తిరిగి ఎన్నికలు వస్తున్న తరుణంలో బయటకి వచ్చి బీజేపీ మీద యుద్ధం చేస్తున్నట్టుగా మాట్లాడుతుందని విషయం జనాల్లో బాగా టాక్ నడుస్తోంది. ఇకపోతే ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే జగన్ కు కూడా ప్రజలు పట్టం కట్టే అవకాశం ఉందని, అయితే పోయిన ఎన్నికలతో పోలిస్తే పార్టీల మధ్య పోటీ మాత్రం కొంత ఎక్కువగా వుండనుందని చెపుతున్నారు. 2014లో టీడీపీకి మద్దతిచ్చిన జనసేన ఇప్పుడు ప్రత్యక్ష ఎన్నికల్లో బరిలోకి దిగడం, ఇక బీజీపీ, కాంగ్రెస్ లు కూడా ఏపీ పై కాస్త గట్టిగా దృష్టి పెట్టడం వైసీపీకి కాస్త ఇబ్బందికర పరిణామమే. గతంతో పోల్చుకుంటే వైసీపీకి ప్రజాధారణ పెరిగిందనేది స్పష్టంగా కనిపిస్తోంది.