వైసీపీలో బాబాయ్ హావ ! అబ్బాయ్ ఆగ్రహం !     2018-07-02   23:00:07  IST  Bhanu C

రాబోయే ఎన్నికల్లో పార్టీని ఎలాగైనా అధికారంలోకి తీసుకురావాలని వైసీపీ అధినేత జగన్ ఎండనక వాననకా తిరుగుతూ ప్రజల్లో సానుభూతి సంపాదిస్తూ .. దాన్ని ఎన్నికల్లో ఓట్ల రూపంలో వైసీపీకి పడేలా చేసి అధికారం చేజిక్కించుకోవాలని చూస్తున్నాడు. జగన్ పాదయాత్ర ఫలితమే ఏమో కానీ వైసీపీ కూడా ఈ మధ్యకాలంలో బాగానే పుంజుకుంది. రాబోయే ఎన్నికల్లో వైసీపీ అధికారం చేజిక్కించుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అనేక సర్వేలు , విశ్లేషణలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో జగన్ లో హుషారు కూడా పెరిగింది. అయితే ఇదే సమయంలో పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న జగన్ బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి వ్యవహారం తెరమీదకు వచ్చింది.

పార్టీ అధికారంలోకి వస్తున్న ఆశలు పెరుగుతున్న సమయంలో వైసీపీలో పైరవీలు మొదలయ్యాయి. నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఎంపిక చేసే విషయాల్లో జగన్ బంధువుల జోక్యం మితిమీరిపోయిందట. ముఖ్యంగా జగన్ బాబాయ్ వైవీ ఈ వ్యవహారాల్లో తన రాజకీయం చుపిస్తున్నాడంట. జగన్ జైలులో ఉన్నప్పుడు అన్నీ తానై పార్టీని నడిపించి పార్టీలోనూ .. జగన్ దృష్టిలోనూ వైవీ సుబ్బారెడ్డి మంచి మార్కులే సంపాదించాడు. కానీ ఇప్పుడు అభ్యర్థుల ఎంపికలో వైవీ తలదూర్చి ఇష్టానుసారంగా వ్యవహరిస్తుండడం జగన్ దృష్టికి రావడంతో వైవీకి గట్టిగానే క్లాస్ పీకినట్టు సమాచారం.