జగన్ కు ధైర్యం బాగా పెరిగింది ... కావాలంటే రాసిస్తాడు  

గత ఎన్నికల్లో చంద్రబాబు అధికారంలోకి రావడానికి బీజేపీ, జనసేననే కారణమని, వారు ముగ్గురు కలిసినా తమకంటే ఒకటిన్నర శాతం మాత్రమే ఎక్కువ ఓట్లు సంపాదించి అధికార పీఠం దక్కించుందని, ఆ పార్టీకి అంత ధైర్యం ఉండి ఉంటే ఎన్నికల్లో ఒంటరిగా ఎందుకు పోటీ చేయలేకపోయిందని వైసీపీ అధ్యక్షుడు జగన్ ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీని 40 సీట్లకు పరిమితం చేస్తామని, కావాలంటే రాసిస్తానని జగన్ ధీమాగా చెప్పారు. రాబోయేది వైసీపీ ప్రభుత్వమేనన్నారు. ఓ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఏపీని మోసం చేయడంలో పవన్ కళ్యాణ్ పాత్ర చాలా ఉందని, ముగ్గురు కలిసే రాష్ట్రానికి అన్యాయం చేశారని జగన్ ఆరోపించారు. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ను అభిమానించే వ్యక్తులు చంద్రబాబుకి ఓటు వేశారని, ఈసారి వారిలోనూ కొందరు పవన్ కి వేస్తారని, కొందరు వైసీపీకి ఓటు వేస్తారని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో తాము ఎవరి పొత్తు తీసుకోవాలి అనుకోవడం లేదని, మేము ఒంటరిగానే ధైర్యంగా ఎన్నికలకు వెళ్తామని జగన్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ విభజన చేసి ఒక తప్పు చేస్తే, విభజన హామీలను చట్టంలో చేర్చకుండా మరో తప్పు చేసిందన్నారు.

ప్రత్యేక హోదా వంటి హామీలను చట్టంలో చేర్చి ఉంటే కోర్టుకు పోయి అయినా సాధించేవాళ్లమన్నారు. బీజేపీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కూడా అమలు చేయకుండా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఏపీకి తీరని అన్యాయం చేశాయన్నారు. బీజేపీతో వైసీపీ పొత్తు పెట్టుకుందని మాపై నిందలు వేస్తూ.. టీడీపీ రాజకీయ లబ్ది పొందాలని చూస్తోందని, తమకు బీజేపీతో చీకటి ఒప్పందం పెట్టుకునే అంత అవసరం లేదని చెప్పారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై ఎప్పటికప్పుడు కేంద్రంపై తీవ్రంగా విమర్శిస్తున్నానని, తన అసెంబ్లీ ప్రసంగాలు చూస్తే ఈ విషయం అర్థమవుతుందన్నారు.

నాకు ప్రతీకారం తీర్చుకోవాలనే కోరిక లేదని, తాను అధికారంలోకి వస్తే చంద్రబాబు హయాంలో జరిగిన తప్పులను మాత్రం సరిచేస్తామన్నారు. టీడీపీ నేతలు చేస్తున్న తప్పులపై విచారణ చేయిస్తామని, కానీ ఇది ప్రతీకార చర్య కాదన్నారు. చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేసే సమర్థుడని, అందుకే స్టేలు తెచ్చుకోగలుగుతున్నారన్నారు. తనపై లక్ష కోట్లు, లక్ష కోట్లు అని ఆరోపిస్తూ నమ్మేలా చేశారన్నారు. అవి నిరూపించగలరా అని ప్రశ్నించారు. తనపై అవినీతి చేశానని ఆరోపణలు చేశేవారు వారి మనస్సాక్షిని ప్రశ్నించుకోవాలని అన్నారు