మేమే ఎందుకు గెలుస్తాం అంటే ..? కారణాలు చెప్తున్న జగన్     2018-08-19   13:20:08  IST  Sainath G

ఏపీలో టెన్షన్ పెట్టబోతున్న ఎన్నికల వాతావరణం లో ఎవరికి గెలుపు అవకాశాలు ఉండబోతున్నాయి అనేది అందరికి ఆసక్తి కలిగిస్తున్నాయి. మొక్కోణపు పోటీ తీవ్రంగా ఉండబోతున్న ఏపీలో ఎవరికి వారు గెలుపు తమదంటే తమది అనే లెక్కల్లో ఉన్నారు. అయితే ఈ విషయంలో వైసీపీ అధినేత ఖచ్చితమైన అభిప్రాయంతో ఉన్నారు. అంతే కాదు వైసీపీ ఎందుకు గెలవబోతుందో అనే విషయాన్ని కూడా స్పష్టంగా చెప్తున్నాడు. ఒక జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

Ys Jagan,Ysrcp Wins

వైసీపీ ఓటు బ్యాంకు ఇప్పటికీ చెక్కు చెదరలేదని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైసీపీ విజయం ఖాయమని జగన్ ధీమా వ్యక్తం చేశారు. గత ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు పెట్టిన ప్రలోభాలకు ఆశపడి కొంత మంది ఓట్లు వేశారని.. ఆ వర్గాలంతా ఇప్పుడు చంద్రబాబుపై తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారని.. వాళ్లంతా బాబుకు ఎదురుతిరిగి ఓట్లు వేస్తారని, తమ పార్టీ విజయం సాధించడం ఖాయమని జగన్ అభిప్రాయపడ్డాడు. ప్రధానంగా గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు విజయానికి మోదీ , బీజేపీకి ఎంతో కొంత ఉన్న ఓటు బ్యాంకు, పవన్ కల్యాణ్ మద్దతు ఇలా అన్ని విషయాలు ప్రభావం చుపించాయన్నారు.

ప్రస్తుతం ఆ పరిస్థితులు లేవని, బాబు వెంట పవన్ కల్యాణ్ లేడు, బీజేపీ లేదు, మోదీ హావ తగ్గిపోయిందని జగన్ చెప్పుకొచ్చాడు. అవన్నీ ఉన్నప్పుడే చంద్రబాబు నాయుడు సాధించింది కేవలం ఒకటిన్నర శాతం మెజారిటీ అని.. ఇప్పుడు బాబుకు ఆ అవకాశం లేదు కాబట్టి విజయం తమదే అని జగన్ విశ్వాసం వ్యక్తం చేస్తున్నాడు. గత నాలుగేళ్ల పాలనతో చంద్రబాబు నాయుడు తీవ్రమైన ప్రజా వ్యతిరేకతను సంపాదించుకున్నాడని.. తీవ్రమైన అవినీతి, హామీల అమల్లో వైఫల్యం చంద్రబాబు నాయుడును ఓడించే అంశాలన్నారు. రుణమాఫీ అంటూ చంద్రబాబు నాయుడు అప్పుడు ఓట్లను పొందారని.. ఇప్పుడు ఆ విషయంలో ప్రజలు తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారని బాబును వారే ఓడిస్తారని జగన్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు.