జగన్ కొత్తగా మాట్లాడుతున్నాడా ! ప్రాధేయపడుతున్నాడా ?     2018-06-19   03:51:52  IST  Bhanu C

ప్రస్తుత పరిస్థితుల్లో జగన్ కి రాజకీయ పరిస్థితులు ఏవీ కలిసిరావడం లేదు. ఎండనకా ..వాననకా పాదయాత్ర చేస్తూ.. జనాల్లో సానుభూతి పొంది తద్వారా రాజకీయ చక్రం తిప్పాలని చూస్తున్నాడు. అయితే అది అనుకున్నంత ఈజీ కాదని ఇప్పుడిప్పుడే ఆయనకు తెలిసొస్తుంది. తాజాగా విడుదలైన ఓ సర్వే ఫలితాలు టీడీపీకి అనుకూలంగా ఉండడంతో జగన్ లో అసహనం మరింత పెరిగినట్టు తెలుస్తోంది.

పాదయాత్ర ద్వారా ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న జగన్ కి ప్రస్తుత పరిస్థితులు ఏవీ కలిసిరావడంలేదు. జిల్లాలో పాదయాత్ర మూడో రోజే.. చంద్రబాబుపై వ్యక్తిగతంగా తిట్లుపురాణం మొదలుపెట్టాడు. ఏదైనా బావి చూసుకుని దూకి చావాలని.. చంద్రబాబుకు శాపనార్థాలు కూడా పెట్టేసాడు. జగన్ ఆవేశం చూసి ఆ పార్టీ కార్యకర్తలు చప్పట్లు కొట్టినా.. జగన్ ఇంతగా అసహనానికి గురవడం ఏమిటన్న చర్చ ఆ పార్టీలో ప్రారంభమయింది. వివిధ సర్వేల్లో వెల్లడవుతున్న ఫలితాలే జగన్ అసహనానికి కారణమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.