Will AP Home Minister get Promotion..?

ఉగాది రోజున కాని..ఉగాది త‌ర్వాత కాని ఏపీ సీఎం త‌న కేబినెట్‌ను భారీ స్థాయిలో ప్ర‌క్షాళ‌న చేస్తార‌ని వార్త‌లు వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ ప్ర‌క్షాళ‌న‌లో ఏపీ హోం మంత్రి, డిప్యూటీ సీఎం నిమ్మ‌కాయ‌ల చిన‌రాజ‌ప్ప ప్లేస్‌పై ర‌క‌ర‌కాల చ‌ర్చ‌లు వినిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం ఏపీలో కాపు ఓటు బ్యాంకు కీల‌కం కానుంది. కాపు ఉద్య‌మ ప్ర‌భావంతో కాపుల‌ను అన్ని విధాలా సంతృప్తి ప‌ర‌చాల్సిన అవ‌స‌రం ఉంది. ఈ నేప‌థ్యంలో కాపుల్లో దూకుడుగా ఉండే నేత‌లు టీడీపీకి, చంద్ర‌బాబుకు అత్య‌వ‌స‌రం కానున్నారు.

ఈ క్ర‌మంలోనే ఉత్త‌రాంధ్ర‌లో కాపు వ‌ర్గానికి చెందిన ప్ర‌స్తుతం ఏపీ టీడీపీ అధ్య‌క్షుడు, మాజీ హోం మంత్రి కిమిడి క‌ళా వెంక‌ట‌రావును బాబు త‌న కేబినెట్‌లోకి తీసుకుంటార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. క‌ళా వెంక‌ట్రావు ఇటీవ‌ల పార్టీలో చాలా స్పీడ్‌గా క‌దులుతూ, అంద‌రిని స‌మ‌న్వయం చేసుకుంటూ ఏపీ టీడీపీ అధ్య‌క్షుడిగా మంచి ప్ర‌తిభ క‌న‌ప‌రుస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న బ‌య‌ట ఉండడం కంటే కేబినెట్‌లో ఉంటేనే మంచిద‌న్న నిర్ణ‌యానికి చంద్ర‌బాబు వ‌చ్చార‌ట‌.