ముంచినోడే మంచోడయ్యాడా .. దీక్షితులు గారు ..  

తిరుమల తిరుపతి దేవస్థానంలో అపచారాలు జరిగిపోతున్నాయి .. ఘోరాలు జరిగిపోతున్నాయి అంటూ మీడియా సమావేశం పెట్టి మరీ బాహ్యప్రపంచానికి తెలిసేలా ఆరోపణలు చేసిన టీటీడీ మాజీ ప్రధానార్చకులు రమణ దీక్షితులు కొద్దిగా మెత్తబడినట్టు కనిపిస్తున్నారు. అయన గతంలో చేసిన ఆరోపణలతో తెలుగుదేశం ప్రభుత్వం బాగా ఇబ్బంది పడింది. రాజకీయంగా అనేక ఆరోపణలు ఎదుర్కొంది. ఒక దశలో హిందువులంతా టీడీపీ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవన్నీ కేవలం రమణ దీక్షితులు లేవనెత్తిన అంశాల కారణంగానే. పదవి నుంచి తప్పించగానే రమణ దీక్షితులు ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఓ వైపు రాజకీయ నాయకులను కలుస్తూనే మరోవైపు కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ఈ వ్యవహారాన్నిరాష్ట్ర స్థాయిలోనే తేల్చుకోవాలని స్వయంగా న్యాయశాఖ చెప్పడంతో చేసేది ఏమీలేక ఆయన చంద్రబాబు భజన మొదలుపెట్టినట్టుగా కనిపిస్తోంది.

ఆయన చెన్నైలో మాట్లాడిన మాటలే ఇందుకు నిదర్శనంగా కనిపిస్తున్నాయి. ఒకప్పుడు ఏపీ సర్కార్‌పై విరుచుకునే ఆయన, ఈసారి సైలెంట్ అయ్యారు. టీటీడీపై ఆయన చేసిన ఆరోపణల వేడి తగ్గిస్తూనే, సీఎం చంద్రబాబును ఆకాశానికి ఎత్తేశారు. గతంలో తాను చేసిన ఆరోపణలకు భక్తుల నుంచి స్పందన కరువైందని, సాటి అర్చకుల మద్దతుకూడా లభించలేదని ఆవేదన వ్యక్తంచేశారు. తనపై సీఎం చంద్రబాబు మనసులో ఏమీలేదని, కొందరి ప్రోద్బలంతోనే తనపై ఆయనకు వ్యతిరేకత వచ్చిందన్నారు. సీఎంను కలిసేందుకు చాలాసార్లు ప్రయత్నించానని, అపాయింట్‌మెంట్‌ ఇచ్చి రద్దు చేసుకున్నారని గుర్తుచేశారు.

సీఎం చంద్రబాబు తనకు చిన్నప్పటి నుంచి బాగా తెలుసని, ఎస్వీ యూనివర్సిటీలో తనకు జూనియర్‌ అని వివరించారు. ఆయనతో తనకు మంచి సంబధాలు ఉండేవని తెలిపారు. మేమంతా స్వామివారి భక్తులమే.. తాను అర్చకుణ్ని కాబట్టి కొండపై అంతా బాగుండాలని కోరుకుంటానని, ఆయన రాష్ట్రమంతా బాగుండాలని కోరుకుంటున్నారని తెలిపారు. అయితే దీక్షితులు ఒక్కసారిగా ఇలా ప్లేట్ ఫిరాయించడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది.