ముద్రగడ మద్దతు ఎవరికో ... ఆయన కోసం పార్టీల ఆరాటం  

ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో సామజిక వర్గాల అండ పార్టీలకు అవసరం. కాదు కాదు అత్యవసరం. కులల అండ ఉంటే గెలుపు సులభం అవుతుందని పార్టీలు లెక్కలు వేసుకుంటూ … ముందుకు వెళ్తున్నాయి. వైసీపీ అధినేత జగన్‌ తూర్పుగోదావరి జిల్లా పర్యటనతో కాపు రిజర్వేషన్ల అంశం మరోమారు తెరపైకి వచ్చింది. కాపులకు రిజర్వేషన్లు తాను ఇవ్వలేనని, అది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉందని జగన్‌ తేల్చిచెప్పడం, ఆ తర్వాత వచ్చిన విమర్శలతో జగన్‌ యూ టర్న్‌ తీసుకున్న విషయం తెలిసిందే. ఆతరువాత ముద్రగడ జగన్ తీరుని తప్పుబట్టడం కూడా జరిగింది. దీంతో మొదటి నుంచి ముద్రగడ వెనుక జగన్ ఉన్నారు అనే విషయం అవాస్తవం అని తేలిపోయింది. ఇప్పుడు తేలాల్సింది అంత ప్రస్తుతం ముద్రగడ రాజకీయ పయనం ఎటు..? ఆయన మద్దతు ఎవరికీ అనేది.

కాపు రిజర్వేషన్లకు మద్దతు ఇచ్చిన వారికే కాపులు ఓట్లు వేస్తారని స్పష్టం చేశారు. 2016 ఫిబ్రవరి నుంచి కాపు ఉద్యమానికి జగన్‌ మద్దతు ఇవ్వడంతో వైసీపీకి ముద్రగడ మద్దతు ఉందని భావించిన అన్ని రాజకీయ పార్టీలు ఇప్పుడు ఆ పరిస్థితి లేదని భావించి ముద్రగడ వైపు దృష్టి మళ్ళించారు. ముద్రగడ పద్మనాభంను తమ వైపు తిప్పుకుంటే, కొంత అయినా కాపు ఓట్లను తమ పార్టీకి అనుకూలంగా మార్చుకోవాలని అన్ని పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి.

కాంగ్రెస్‌ పార్టీ జిల్లా నేతలు కూడా ముద్రగడను పార్టీలోకి ఆహ్వానించారు. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్‌ పార్టీయేనని, కాపులకు రిజర్వేషన్లు కాంగ్రెస్‌ పార్టీ ఇస్తుందని చెప్పి ముద్రగడను కలిసి వివరిస్తూ ఏఐసీసీ ఇచ్చిన హామీ లేఖను కూడా ముద్రగడకు ఇచ్చారు. మరోవైపు వైసీపీ అధినేత జగన్‌ కాపు రిజర్వేషన్లకు మద్దతు ఇస్తున్నారని ఆ పార్టీ నేతలు ప్రచారం చేసుకుంటున్నారు. వైసీపీలో ఉంటూ కాపు ఉద్యమంలో పనిచేస్తున్న కొంతమంది కాపు నేతలు కూడా ముద్రగడను కలిసి వైసీపీకి మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. ఇక జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ కాపు రిజర్వేషన్లపై ఎటూ తేల్చడం లేదు. కాపులకు రిజర్వేషన్లు ఇస్తే వద్దన బోమని చెబుతూనే కులం పరంగా తాను ఏ నిర్ణయం తీసుకోనని తేల్చిచెప్పారు.

అధికార తెలుగుదేశం పార్టీ ఇప్పటికే కాపులకు రిజర్వేషన్లు మేమే ఇస్తామని, ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చేది టీడీపీయేనని, ఇప్పటికే అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంట్‌లో కూడా పంపించింది. అయితే ముద్రగడ ప్రస్తుత పరిస్థితుల్లో కాపు రిజర్వేషన్లకు అనుకూలంగా అడుగులు వేసున్న అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తారా? లేక ఇతర పార్టీలకు మద్దతు ఇస్తారా? అనేది తేలాల్సిఉంది.