పవన్ ఇన్ని ఆలోచిస్తున్నాడా..తెర వెనుక ఇంత కథ ఉందా..    2018-07-11   00:47:27  IST  Bhanu C

ఏపీలో జనసేన పార్టీ దూకుడు కొనసాగుతోంది. వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేసినా.. మెజార్టీ సీట్లు దక్కించుకునే అవకాశం ప్రస్తుతానికి ఆ పార్టీకి ఉన్నట్టు కనిపించడంలేదు. అలాగే.. జనసేనలో జనం లేరు అని వస్తున్న విమర్శలకు చెక్ పెట్టేందుకు మెగా అభిమానులందరినీ పార్టీలోకి ఆహ్వానించేసి పార్టీలో జోష్ నింపారు. అయితే పవన్ రాజకీయంగా పుంజుకోవడం వలన ఏపీ లో ఏ పార్టీ దెబ్బతింటుంది..? ఒక వేళ ఏ పార్టీకి కూడా స్ప్రష్టమైన మెజార్టీ రాకపోతే పవన్ చక్రం తిప్పే అవకాశం ఉందా అనే ప్రశ్నలు ఇప్పుడు పవన్ చుటూ తిరుగుతున్నాయి.

ఏపీలో జనసేన కార్యకలాపాలు విస్తృతం చేస్తోంది. పార్టీ బలం పెంచుకోవడంతో పాటు, స్థానిక నాయకత్వాన్ని అభివృద్ధి చేయడంపై దృష్టిసారిస్తోంది. రాజకీయంగా మరింత రాణించాలంటే.. ముందుగా టీడీపీని దెబ్బకొట్టాలని జనసేన చూస్తోంది. అందుకే తెలుగుదేశాన్ని ప్రధానంగా టార్గెట్ చేస్తూ ప్రజల్లోకి వెళుతోంది. వైసీపీ నేత జగన్ విషయంలో మాత్రం ఆచితూచి వ్యవహరిస్తోంది. బీజేపీ విషయంలో మాత్రం తొందరపడకుండా వ్యూహాత్మకంగా అడుగులువేస్తున్నాడు పవన్. వామపక్షాలతో ఎలాగు మంచి సంబంధాలే కొనసాగిస్తున్నాడు. వారు పవన్ మా సీఎం అభ్యర్థి అని కూడా ప్రకటించుకున్నారు.

టీడీపీ ని గెలిపించడంలో తన పాత్ర ఉంది కాబట్టి ఇప్పుడు తప్పుల విషయంలోనూ నిలదీయాల్సిన కర్తవ్యం తనపై ఉందంటున్నారు. బీజేపీకి ఇక్కడ పెద్దగా పాత్ర లేదు కాబట్టి దాని వ్యతిరేక ఓట్లు పట్టుకోవాలనే వ్యూహం ఫలించే అవకాశం లేదనేది జనసేన అంచనా. కాపు సామాజిక వర్గంతో పాటు ఇతర బలహీన వర్గాలను ఆకట్టుకునే దిశలో ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో బాదితులుగా మిగిలిపోయిన వారిని దగ్గర చేసుకునేందుకు పవన్ స్వయంగా వారిని కలుస్తున్నారు. ఈ ఓటు బ్యాంకును పటిష్టం చేసుకుంటే ఓట్ల పర్సంటేజీ బాగా మెరుగుపడుతుందని అంచనా వేస్తున్నారు.

ఇక వైసీపీ విషయానికి వస్తే… ఈ విషయంలో జనసేన డైలమాలో ఉంది. జగన్ తో జత కడదామా లేక ఒంటరిగా వెళదామా అనే విషయాన్ని ఎటూ తేల్చుకోలేకపోతోంది.
వైసీపీ మాజీ ఎంపీ వరప్రసాద్ జనసేన వైసీపికి మద్దతు ఇస్తుందని బహిరంగంగానే ప్రకటన చేశారు. జనసేన దానిని ఇంతవరకూ ఖండించలేకపోయింది. వరప్రసాద్ తో ఒక సందర్బంలో చిట్ చాట్ లో తనకు జగన్ పై ఎటువంటి వ్యతిరేకత లేదని పవన్ చెప్పారు. దానిని ప్రాతిపదికగా తీసుకుంటూ ఈ తాజా మాజీ ఎంపీ స్టేట్ మెంట్ ఇచ్చేశారు. జనసేన దీనిపై వ్యూహాత్మక మౌనం పాటిస్తోంది. జనసేనకు 30 నుంచి 35 స్థానాలు లభిస్తాయని ఆ పార్టీ అంతర్గతంగా అంచనా వేసుకుంటోంది. టీడీపీ, వైసీపీలు 60 నుంచి 80 లోపు స్థానాలకు పరిమితమైతే జనసేన కీలక రాజకీయ శక్తిగా మారుతుందని భావిస్తున్నారు. అప్పుడు టీడీపీ, వైసీపీ రాజకీయ అవసరాల కోసం జనసేనను ఆశ్రయించాల్సిందే అన్న ధీమాలో పవన్ ఉన్నాడు.