పీకే టీమ్ పై పీకలదాకా ఉందా ... ఎందుకంత గుర్రు.  

వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారం దక్కించుకోవాలనే ఏకైక లక్ష్యంతో వైసీపీ అధ్యక్షుడు జగన్ ఉన్నాడు. అందుకోసం ఎంత కష్టమైనా నస్టమైనా ప్రజల్లోనే నిత్యం ఉంటూ వారి మద్దతు ఓట్ల రూపంలో పొందేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. గతంలో ఎలాగైతే మూలాన పడిన కాంగ్రెస్ పార్టీని తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి తన పాదయాత్ర ద్వారా పైకి తీసుకువచ్చి ఎన్నికల్లో విజయబావుటా ఎగురవేసాడో సరిగ్గా అదే ఫార్ములాను ఇప్పుడు జగన్ అనుసరిస్తున్నాడు. ఎందుకంటే ఈ సారి ఎన్నికల్లో పార్టీ అధికారం దక్కపోతే ఏమి జరుగుతుందో జగన్ కు బాగా తెలుసు. అందుకే ఏరి కోరి మరీ ఒక రాజకీయ సలహాదారుడిని కూడా జగన్ ఏర్పాటు చేసుకున్నాడు.

ఇక కేవలం పాదయాత్రను మాత్రమే కాకుండా జగన్ మోహన్ రెడ్డి స్ట్రాటజీని కూడా నమ్ముకున్నాడు. వ్యూహాత్మకంగా వ్యవహరించి ఎన్నికల్లో గెలుపొందేందుకు ప్రణాళికలు రచిస్తూ ఉన్నాడు. జగన్ మోహన్ రెడ్డి. పార్టీ జనాల్లోకి వెళ్లడానికి వ్యూహాలను రచించడం, ఆ తరహా కార్యక్రమాలకు రూపకల్పన చేయడం ప్రశాంత్ కిషోర్, ఆయన టీమ్ పని. వీరితో జగన్ ఒప్పందం కుదుర్చుకుని కూడా నెలలు గడిచిపోయాయి. కానీ ఆశించిన స్థాయిలో మాత్రం ఫలితం కనిపించడంలేదు.

ప్రశాంత్ కిషోర్ టీమ్ పార్టీ బలోపేతానికి మీకు ఏమైనా సలహాలు ఇస్తోందా? ఏమైనా గైడెన్స్ ఇస్తోందా? అనే అంశాల గురించి వైసీపీ ముఖ్య నాయకులను ఆరా తీస్తే… అబ్బే అలాంటిదేమీ లేదని చెబుతున్నాయి. ఏ ఉద్దేశంతో అయితే, ఏ ప్రయోజనాల కోసం అయితే జగన్ పీకేతో ఒప్పందం కుదుర్చుకున్నాడో.. అవి నెరవేరడం లేదని తెలుస్తోంది. ఇప్పటి వరకూ చెప్పుకోదగిన స్థాయిలో పీకే టీమ్ ఒక్క కార్యక్రమాన్ని కూడా సక్సెస్ చెయ్యలేదన్నట్టు ఆ పార్టీ నాయకులు చెప్పుకొస్తున్నారు.

తన రాజకీయ వ్యూహాలతో ప్రత్యర్థి పార్టీలను ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తాడని జగన్ అండ్ కో భావిస్తే … అందుకు విరుద్ధమైన ఫలితాలను పీకే తీరం చూపిస్తోంది. వైసీపీని బలోపేతం చేయడానికి, పార్టీని ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లడానికి మంచి మంచి కార్యక్రమాలతో వస్తుందనుకుంటే.. అలాంటి దాఖలాలు ఏమీ కనిపించడం లేదని తెలుస్తోంది.

ఇటీవల జగ్గంపేటలో వైసీపీ నియోజకవర్గాల ఇన్‌చార్జిల, పార్లమెంటరీ నియోజకవర్గాల బాధ్యులతో జగన్ సమావేశం జరగాల్సి ఉండింది. అయితే ఆఖరి నిమిషంలో అది రద్దు అయ్యింది. ఆ మీటింగుకు సంబంధించిన డెమోను రెడీ చేయడంలో పీకే టీమ్ ఫెయిల్యూర్ కావడంతోనే మీటింగ్ రద్దు అయినట్టు తెలుస్తోంది. పీకే పై జగన్ కూడా అసంతృప్తిగానే ఉన్నాడు. కానీ ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పీకే ని దూరం చేసుకోవడం మంచిది కాదు అనే ఆలోచనలో జగన్ ఉన్నాడు.