టీడీపీ విష‌యంలో ప‌వ‌న్ చేసిన త‌ప్పేంటి..?!     2018-05-31   00:32:12  IST  Bhanu C

మూడు రోజుల మ‌హానాడు వేదిక‌గా.. టీడీపీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబు స‌హా పార్టీ నాయ‌కులు అంద‌రూ మూకుమ్మ‌డిగా.. బీజేపీపై విరుచుకు ప‌డ్డారు. ప‌నిలోప‌నిగా ప‌వ‌న్‌ను ఏకేశారు. కులం పేరుతో ప్ర‌జల్లో విభేదాలు సృష్టించేందుకు `ఒక‌రు` ప్ర‌య‌త్నిస్తున్నారంటూ.. ప‌వ‌న్‌ను దుయ్య‌బ‌ట్టారు. మ‌రి నాలుగేళ్ల కాలంలో మిత్రుడిగా ఉన్న ప‌వ‌న్ విష‌యంలో చంద్ర‌బాబుకు ఇప్పుడే నిజాలు తెలిసాయా? ఆయ‌న కుల పిచ్చిగ‌ల వాడ‌ని ఇప్పుడే తెలిసిందా? అనేవి ప్ర‌ధాన ప్ర‌శ్న‌లు. నిజానికి ప‌వ‌న్ ఇప్ప‌టికీ టీడీపీకి మ‌ద్ద‌తిచ్చి ఉంటే. . లేదా టీడీపీ అవినీతిపై మౌనంగా ఉండి ఉంటే ప‌రిస్థితి మ‌రో ర‌కంగా ఉండేది. కానీ, ప‌వ‌న్ ఇప్పుడు టీడీపీని ఏకేస్తున్నాడు. బాబుకు రిటైర్మెంట్ ప్ర‌క‌టిస్తాన‌ని చెబుతున్నాడు. దీంతో టీడీపీ మ‌రింతగా గంద‌ర గోళానికి గురై.. లేనిపోని ఆరోప‌ణ‌లు గుప్పిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

నిజానికి నాలుగేళ్ల పాటు తాను చంద్రబాబు ప్రభుత్వం అవినీతి, అభివృద్ధి చేయలేకపోవడం అనే అంశాలపై మౌనంగా ఉండటానికి కారణం వేచి చూడడమేనని పవన్ చెప్పాడు. అంతేకాదు, లోకేష్‌పై చేసిన అవినీతి ఆరోపణలు కూడా వ్యూహాత్మకంగానే చేశాడు. ఈ విషయం చంద్రబాబుకు తెలియదని భావిస్తున్నానని, ఇప్పటికీ చర్యలు తీసుకోకుంటే ముఖ్యమంత్రికి తెలిసే జరుగుతుందని భావించవలసి ఉంటుందని జనసేన పార్టీ ఆవిర్భావ సభ సందర్భంగా అభిప్రాయపడ్డాడు. అలాగే, ప్రత్యేక హోదాపై ఎన్నో రకాల మాటలు మార్చారని నేరుగానే విరుచుకుపడ్డాడు. కానీ, పవన్ కళ్యాణ్‌పై టీడీపీ నేతల ఎదురుదాడికి మాత్రం వారి వద్ద సమాధానం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే, గత నాలుగేళ్లుగా ఆయన హెచ్చరికగానో లేక మృదువుగానో లేవనెత్తిన సమస్యలపై టీడీపీ సానుకూలంగా స్పందించింది. జగన్‌తో పోల్చుతూ జనసేనానిపై ప్రశంసలు కురిపించింది.