ఆహారంలో పీచు అధికంగా ఉండాలంటే తీసుకోవలసిన ఆహారాలు  

మనం తీసుకొనే ఆహారాన్ని బట్టి మన జీవక్రియ ఆధారపడి ఉంటుంది. వయస్సు పెరిగే కొద్ది జీవక్రియలో మార్పులు రావటం సహజమే. అయితే మార్పులకు చెక్ పెట్టాలంటే తీసుకొనే ఆహారంలో పీచు పదార్ధాలు ఉండేలా చూసుకోవాలి. ఇలా పీచు పదార్ధాలు ఆహారంలో భాగంగా చేసుకుంటే మలబద్దకం,అజీర్ణం వంటి జీర్ణ సంబంధ సమస్యలు రాకుండా ఉంటాయి.

ఈ సీజన్ లో మొక్కజొన్న పొత్తులు విరివిగా దొరుకుతున్నాయి. లేతగా ఉన్న పోత్తుల నుండి గింజలను వలిచి బాగా నమిలి తినండి.

ప్రొటీన్, ఫైబర్ సమృద్ధిగా వుండే బఠాణీలు, మొక్కజొన్న గింజలతో స్నాక్స్ తయారుచేసుకోండి. అలాగే వాటిని పొడిగా చేసి సూప్ తయారు చేసి తాగితే ఇంకా రుచికరంగా వుంటుంది.

ఆరెంజ్ లలో కూడా పీచుసమృద్ధిగా వుంటుంది. వీటి తొనలపై వుండే పీచు తీయకుండా తొక్క వరకు తీసి తింటే శరీరానికి అవసరమైన పీచు అందుతుంది.

మైదా బ్రెడ్ కు బదులుగా గోధుమ, బ్రౌన్ బ్రెడ్, బిస్కట్లు, మాల్ట్ వంటివి తినటం అలవాటు చేసుకోండి.

మాంసం తినటం తగ్గించి తాజా కూరగాయలు, పండ్లు, కాయలను తినటం అలవాటు చేసుకోవాలి. పండ్ల రసాలు, సలాడ్లు అధికంగా ఆహారంలో చేరిస్తే, స్లిమ్ గా ఆరోగ్యంగా ఉంటారన్న విషయాన్నీ గుర్తుంచుకోండి. ఇలా ఆహారంలో పీచు పదార్ధాలు ఉండేలా చూసుకుంటే వయస్సు రీత్యా వచ్చే జీర్ణ సంబంధ సమస్యలు రాకుండా ఉంటాయి.