భారత్-పాకిస్తాన్ యుద్ధాల చరిత్ర ... ఎవరెన్ని గెలిచారంటే     2018-05-23   01:23:11  IST  Raghu V

దేశాల మధ్య శతృత్వం అనగానే భారత్ – పాకిస్తాన్ గుర్తుకువస్తాయి మనకు. ఇంతకంటే దారుణమైన సంబంధాలు ఉన్న దేశాలు లేవని కాదు, కాని మనకు తెలిసినంతవరకు పాకిస్తాన్ ఒక బద్ద శతృవు. ఏ విషయంలో అయినా సరే, భారత్ పాకిస్తాన్ కి ఒక్క అంగుళం కూడా చిన్న కాకూడదు అని తపనపడతాం. ఇండియా ప్రపంచకప్ ఓడిపోయిన ఫర్వాలేదు కాని పాకిస్తాన్ తో క్రికేట్ మ్యాచ్ మాత్రం ఓడిపోకూడదు అని ఈగో పెంచేసుకుంటాం. సినిమాల్లో మన హీరోలు పాకిస్తాన్ తీవ్రవాదులపై ముష్ఠిఘాతాలు కురిపిస్తే మురిసిపోతాం. ఎందుకంటారు? పాకిస్తాన్ శతృవు కాబట్టి అంత పట్టింపు సరే, కాని శతృత్వం ఎందుకు? అసలు ఇది ఎలా మొదలైంది? ఎలా యుద్ధాలకు దారితీసింది? భారత్ పాకిస్తాన్ మధ్య ఇప్పటివరకు ఎన్ని యుద్ధాలు జరిగాయి? ఎందుకు జరిగిగాయి? ఎవరెన్ని గెలిచారు? ఈ చరిత్ర మొత్తాన్ని కొంచెం క్లుప్తంగా వివరిస్తాం, చదవండి.

ఇండియా పాకిస్థాన్ మధ్య గొడవలకి ప్రధాన కారణం కష్మీర్ అని మనందరికి తెలుసు. ఇరు దేశాల మధ్య దశాబ్దాల విభేదాల కారణంగా మూడు యుద్ధాలు జరగగా, 1971 లో జరిగిన యుద్ధం మాత్రం ఈస్ట్ పాకిస్తాన్ (ఇప్పటి బంగ్లాదేశ్) విముక్తి కోసం జరిగింది. ఇప్పుడు ఈ నాలుగు యుద్ధాల గురించి తెలుసుకుందాం.

1947 యుద్ధం :

చరిత్రలో బేసిక్స్ తెలిస్తే మీకు చెప్పాల్సిన అవసరం లేదు కాని, స్వాతంత్ర్యం దక్కిన తరువాత కూడా కష్మీర్ తో మన హైదరాబాదు రాజుల పాలనలో ఉండేవి. ఈ నగరాలు/రాష్ట్రాల మీద బ్రిటిష్ ఇండియా అధికారం ఉండేది కాదు. కాని అంతర్గతంగా అవి భారతదేశంలో భాగాలే. హైదరాబాద్ దక్షిణ భారతదేశంలో ఉండటంతో కన్ను పడలేదు కాని, కష్మీర్ కూడా తమకే కావాలంటూ ఆశపడింది పాకిస్తాన్. అప్పుడు కష్మీర్ మరియు జమ్ము రాజా హరి సింగ్ పాలనలో ఉండేవి. రాజు హిందువు అయినా, ఈ ప్రాంతాల్లో ముస్లీం జనాభే ఎక్కువ ఉండేది. స్వాతంత్ర్యం అనంతరం జమ్ము మరియు కష్మీర్ ని ఇండియాలో కలపాలా లేక పాకిస్తాన్ లోనా అనే అధికారం రాజు చేతిలోనే పెట్టారు‌. రాజు ఆలోచనలో ఉండగానే అప్రమత్తమైన పాకిస్తాన్, తన సైన్యాన్ని పంపించి, మతం పేరుతో స్థానికులని మభ్యపెట్టి, రాజమీదకు దాడికి దిగింది. దాంతో హరి సింగ్ భారత సైన్యం సహాయం తీసుకున్నాడు. అప్పుడే భారత్ పాకిస్తాన్ ల మధ్య కష్మీర్ కోసం మొదటి యుద్ధం జరిగింది. రాజు జమ్ము కష్మీర్ మొత్తాన్ని భారతదేశంలో విలీనం చేసినా, కష్మీర్ లో ఉత్తర భాగాన్ని చాలావరకు ఆక్రమించేసింది పాకిస్తాన్. దీన్ని POK అంటే Pakistan Occupied Kashmir అని అంటారు. 1961 లో చైనాతో జరిగిన యుద్ధంలో జమ్ము & కశ్మీర్ లో మరో భాగం అక్సాయ్ చిన్ ని కోల్పోయింది భారత్. ఇక్కడినుండి మొదలు, భారత్ పాకిస్తాన్, భారత్ చైనాల మధ్య విభేదాలకి కేంద్రబిందువుగా మారింది కశ్మీర్.