బాబు గారికి ఓ లేఖ ... సోషల్ మీడియాలో వైరల్     2018-05-26   23:35:18  IST  Bhanu C

సోషల్ మీడియా ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అయిపోయింది. ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ వాడుతుండడంతో.. సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడుపుతున్నారు. అందుకే ఈ మధ్యకాలంలో ఎలక్ట్రానిక్ మీడియా కి కూడా పెద్ద ఆదరణ కూడా కనిపించడంలేదు. ఎవరు ఏమి చెప్పాలనుకున్నా .. ప్రభుత్వాన్ని, ప్రతిపక్షాలను నిలదీయాలనుకున్నా సోషల్ మీడియా ను ఉపయోగించుకుంటున్నారు. ఒకరకంగా చెప్పాలంటే .. సోషల్ మీడియా అంటే ప్రతి ఒక్కరికి ఒక ఛానెల్ ఉన్నట్టే లెక్క అన్నట్టు పరిస్థితి ఉంది. ఇంతకీ విషయం ఏంటంటే.. ఒక సామాన్యుడి ప్రశ్న అంటూ చంద్రబాబు ని ప్రశ్నిస్తున్న ఓ లేఖ సోషల్ మీడియా లో గిర్రా గిర్రా తిరుగుతోంది. అది యధాతథంగా ఇలా ఉంది.

మాన్యులు, గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి
సవినయంగా రాయునది ఏమనగా…

విభజన తర్వాత తీవ్రంగా దగాపడి అన్యాయం కాబడిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన మీరు మహానాడు పేరుతో చేస్తున్న ఆర్భాటానికి కడుపు మండి మీకు ఓటు హక్కు వేసిన హక్కుతో ఓ సామాన్య పౌరుడిగా అడుగుతున్న నా ధర్మ సందేహాలు తీర్చగలరని మనవి. రాష్ట్రం అప్పుల్లో ఉంది అని పదే పదే జపిస్తూ సానుభూతి కోసం పరితపించే మీరు ఇన్ని కోట్ల రూపాయలతో మహానాడు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందో కాస్త చెబుతారా. అంతగా కావాలి అనుకుంటే రాజధాని అమరావతిలోనో లేదా హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో పెట్టుకుంటే పోయేదానికి ఇంత హంగామా ఎందుకు?

ప్రజలు సమస్యలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. నీటి కొరత, రవాణా సౌకర్యం లాంటి కనీస వసతులు లేక వందల కొద్ది గ్రామాలు నరక కూపాల్ని తలపిస్తున్నాయి. కానీ మీ మహానాడుకు ఎటువంటి ఆటంకం కలగకుండా మొత్తం ఉద్యోగ వ్యవస్థనే దీని కోసం వాడుతున్నారే. దీన్నేమంటారో మీరే చెబుతారా?

మహానాడు ప్రాంగణంలో వెలుస్తున్న నిలువెత్తు కటౌట్లకు, వేడుక అయిపోయాక పైసాకు పనికిరాని ఫ్లెక్సీలకు ఎన్ని లక్షల రూపాయలు మీ టిడిపి నాయకులు ఖర్చు పెడుతున్నారో మీకేమైనా తెలుసా. ఆ డబ్బులో సగం విదిల్చినా చాలు ఎన్నో గ్రామాలకు మంచి నీటి సౌకర్యం కల్పించవచ్చు కాదంటారా?