UP Elections : Congress, Akhilesh-led SP alliance

ఉత్త‌ర‌ప్ర‌దేశ్.. దేశ రాజ‌కీయాల్లో కీల‌కమైన రాష్ట్రం. ఇక్క‌డ వ‌చ్చే నెల‌లో జ‌రిగే ఎన్నిక‌ల‌కు ఇప్ప‌టి నుంచే అన్ని పార్టీలు ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నాయి. తండ్రీ కొడుకుల మ‌ధ్య ఆధిప‌త్య పోరు అధికార స‌మాజ్‌వాదీ పార్టీలో చిచ్చురేపుతుంటే.. ఈసారి ఎలాగైనా కాషాయ జెండా రెప‌రెప‌లాడించాల‌ని బీజేపీ త‌హ‌త‌హ‌లాడుతోంది. ఇక కాంగ్రెస్‌, మాయావ‌తి సారథ్యంలోని బీఎస్పీ.. ఇలా అన్ని పార్టీలు యూపీ పీఠం కోసం ప్ర‌ణాళిక‌లు వేస్తున్నాయి. అయితే యూపీలో కులాల ప్రాతిప‌దిక‌న ఓట‌ర్లు చీలిపోతుండ‌టంతో.. సామాజిక‌వర్గాల ఆధారంగా పార్టీలు గేలం వేస్తున్నాయి. 20 కోట్ల జనాభా గ‌ల ఉత్తరప్రదేశ్‌లో సం‘కుల’ సమరానికి తెరలేచింది. అసెంబ్లీకి త్రిముఖ పోరులో సాధారణంగా 30 నుంచి 35 శాతం ఓట్లు సాధిస్తే యూపీలో అధికారంలోకి రావొచ్చ‌నేది విశ్లేష‌కుల అభిప్రాయం! 44 శాతం ఓబీసీలు, 21 శాతం దళితులున్న యూపీలో కులాల వారీగా ఓటర్ల విభజన తీవ్రంగానే ఉంది. ఈ సారి జ‌రిగే ఎన్నిక‌ల్లో ఏ కులం వారు ఎటువైపు అనే అంశాన్ని ప‌రిశీలిస్తే..

బీజేపీ (అగ్రవర్ణాలు+ యాదవేతర ఓబీసీలు)
ఎన్నికల్లో ప్రభావం చూపగల అన్ని కులాలను కూడగట్టుకువెళ్లాలని బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా వ్యూహరచన చేస్తున్నారు. అగ్రవర్ణాల్లో బీజేపీ వైపు మొగ్గు ఉంటుంది. యూపీ జనాభాలో 10 శాతం బ్రాహ్మణులు ఉన్నారు. ఠాకూర్లలోనూ బీజేపీకి పట్టుంది. మరోవైపు రాష్ట్ర జనాభాలో 9 శాతం యాదవులు ఉన్నారు. యాదవుల ఆధిపత్య ధోరణి గిట్టని ఇతర బీసీలు, ఎంబీసీలను బీజేపీ చేరదీస్తోంది. తూర్పు యూపీలో నిర్ణయాత్మక శక్తిగా ఉన్న కుర్మీలు, కోయిరీలు.. యాదవుల తర్వాత ఆర్థికంగా, సామాజికంగా శక్తిమంతులు. ఓబీసీల్లో యాదవులు 19.4 శాతం ఉండగా, ఎంబీసీలు 61.69 శాతం ఉన్నారు. ప్రధాని మోదీ కూడా బీసీనే కావడం, ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకుండా ఎన్నికలకు వెళుతుండటం కూడా బీజేపీకి లాభించే అంశమని రాజకీయ విశ్లేషకుల అంచనా.

బీఎస్పీ (దళిత్‌ + ముస్లిం)
బీఎస్పీ అధినేత్రి మాయావతి ఈసారి కొత్త సమీకరణాలకు తెరతీశారు. దళిత (21%), ముస్లిం (19%) కలయికతో బీజేపీని అడ్డుకోవాలనేది ఆమె వ్యూహం. అలాగే, ముజఫర్‌నగర్, దాద్రీ అల్లర్ల సమయంలో అఖిలేశ్‌ ప్రభుత్వ స్పందనపై అసంతృప్తితో ఉన్న ముస్లింలు ఈ ఎన్నికల్లో తమవైపు వస్తారని ఆమె ఆశిస్తున్నారు. పశ్చిమ యూపీలో 73 సీట్లలో ముస్లింలు నిర్ణయాత్మకంగా ఉన్నారు. ముస్లింలకు 24 శాతం సీట్లు (97) కేటాయించారు. అలాగే, కేంద్రంలో, రాష్ట్రంలో… రెండు చోట్లా బీజేపీ ప్రభుత్వాలే ఉండ‌టాన్ని ముస్లింలు కోరుకోరని ఆమె అంచనా. ముస్లిం ఓట్లలో చీలిక బీజేపీకే లాభం చేకూరుస్తుందని, అందువల్ల ఎస్పీ, కాంగ్రెస్‌లకు ఓటేయొద్దని బహిరంగంగానే హెచ్చరిస్తున్నారు. అలాగే జనాభాలో 10 శాతం దాకా ఉండే బ్రాహ్మణులకు 16.5 శాతం సీట్లు (66) కేటాయించారు.

సమాజ్‌వాదీ పార్టీ (ముస్లిం + యాదవ్‌)
ఎంవై (ముస్లిం– యాదవ్‌) ఫార్ములాతో 2012 అసెంబ్లీ ఎన్నికల్లో 224 స్థానాల్లో గెలుపొంది అధికారం చేపట్టిన సమాజ్‌వాదీ పార్టీ ఎన్నికల వేళ… ఇంటిపోరులో తలమునకలై ఉంది.ఇది స‌ద్దుమ‌ణిగినా ఇదే ఫార్ములా. అయితే దీనికి అఖిలేశ్‌ అభివృద్ధి మంత్రం, క్లీన్‌ ఇమేజ్‌ తొడవుతాయని ఆశిస్తోంది. ములాయంతో ముస్లింలకు అనుబంధం ఎక్కువ. సెక్యులర్‌ పార్టీగా, ముస్లింల ప్రయోజనాలను సంరక్షించే పార్టీగా సమాజ్‌వాదీని నిలబెట్టారు ములాయం. 2012లో ఎస్పీ తొలిసారిగా సొంతబలంతో అధికారం లోనికి వచ్చినపుడు కూడా ముస్లింలలో 39 శాతమే ఎస్పీకి ఓటేశారు. కానీ 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, మోదీ వ్యతిరేకతతో ఏకంగా 58 శాతం ముస్లిం ఓటర్లు ఎస్పీకి అండగా నిలిచారు.

కాంగ్రెస్‌ (అస్తిత్వ పోరాటం)
2012లో కాంగ్రెస్‌ 11.65 శాతం ఓట్లతో 28 అసెంబ్లీ స్థానాలు నెగ్గింది. అదే 2014 లోక్‌సభ ఎన్నికలకు వచ్చే సరికి కాంగ్రెస్‌ ఓటుశాతం 7.5కు పడిపోయింది. కాంగ్రెస్‌కు సంప్రదాయ ఓటర్లుగా ఉన్న బ్రాహ్మణులు, ముస్లింలు, దళితులు… కాలక్రమంలో ఇతర పార్టీలకు మారిపోయారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో అస్తిత్వ పోరాటం చేస్తున్న కాంగ్రెస్‌తో పొత్తుకు అఖిలేశ్‌ ఆసక్తితో ఉన్నారు. ఆర్‌ఎల్డీని కూడా కలుపుకొని… ఓ కూటమిగా ఎన్నికలకు వెళ్లాలనేది అఖిలేశ్‌ ఆలోచన.