టీటీడీ వివాదం సీబీఐ కి చేరబోతోందా..     2018-07-04   01:50:15  IST  Bhanu C

తిరుమల తిరుపతి దేవస్థానం చుట్టూ తిరుగుతున్న వివాదాలు ఇంకా సద్దుమణగలేదు. టీటీడీలో జరుగుతున్న అనేక అక్రమాలపై మీడియా వేదికగా ఆ ఆలయ మాజీ ప్రధానార్చకుడు రమణ దీక్షితులు అనేక ఆరోపణలు చేసి సంచలనం సృష్టించాడు. ఆతరువాత దానికి ప్రభుత్వం కూడా తరఫునుంచి కూడా కౌంటర్లు పడ్డాయి. ఆ తరువాత మెల్లిగా ఈ వివాదమే సద్దుమణిగినట్టు కనిపించినా లోలోపల మాత్రం ఈ వివాదం రగులుతూనే ఉంది.

తాజాగా తిరుమల వెంకన్న ఆభరణాల మాయం – టీటీడీ ఆదాయ వ్యయాలు గుప్త నిధుల కోసం జరిగాయంటున్న తవ్వకాలకు సంబంధించి వాస్తవాలను నిగ్గు తేల్చాలంటూ గుజరాత్ కు చెందిన భూపేందర్ గోస్వామి – గుంటూరు జిల్లాకు చెందిన అనిల్ కుమార్ అనే ఇద్దరు భక్తులు గతంలో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం… సంచలన నిర్ణయాలను తీసుకుంది. పిటిషనర్లు ఆరోపిస్తున్న విషయాలపై మీ స్పందన తెలియజేయాలంటూ టీటీడీ ఈవోతో పాటుగా ఏపీ దేవాదాయ శాఖకు నోటీసులు జారీ చేసింది.

వెంకన్నకు సంబంధించిన నగల్లో చాలా నగలు మాయమైపోయాయని – ఈ నగలను గుట్టుచప్పుడు కాకుండా దేశం దాటించేసిన కొందరు వ్యక్తులు వాటిని అమ్మేసుకుని సొమ్ము చేసుకున్నారని రమణ దీక్షితులు సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాకుండా శ్రీవారి పోటులో గుప్త నిధులు ఉన్నాయని వాటిని తవ్వి తీసేందుకు కూడా యత్నాలు జరిగాయని , ఈ క్రమంలోనే గతంలో ఉన్న పోటు నుంచి శ్రీవారి ప్రసాదాల తయారీ మరో ప్రాంతానికి తరలిందని కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇక శ్రీవారి ఆభరణాల్లో అత్యంత విలువైనదిగా భావిస్తున్న రూబీ డైమండ్ ను కూడా విదేశాలకు తరలించేశారని దీక్షితులు ఆరోపణలు గుప్పించారు.