టీఆర్‌ఎస్‌కు అనుకున్నంత ఈజీ అయితే కాదు!     2018-06-11   23:45:43  IST  Bhanu C

2014 సంవత్సరంలో జరిగిన ఎన్నికలకు 2019లో జరుగబోతున్న ఎన్నికలకు చాలా ప్రత్యేకత ఉంది. 2014 ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ, టీఆర్‌ఎస్‌ పార్టీలు అధికారంను దక్కించుకోగా కేంద్రంలో బీజేపీ సత్తా చాటడంతో మోడీ ప్రధాని అయ్యారు. సహజంగా అయితే రెండు సార్లు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత వ్యతిరేకత అనేది వ్యక్తం అవుతుంది. గత కొంత కాలంగా చూసుకుంటే ఎక్కువ శాతం రెండు దఫాలుగా అధికారంలో ఉన్న ప్రభుత్వాలను మనం చూస్తూ వస్తున్నాం. కాని ప్రస్తుత పరిస్థితి తారు మారు అయ్యేలా అనిపిస్తుంది. ఇప్పటికే కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడం దాదాపు అసాధ్యం అని అంటున్నారు. ఒకవేళ బీజేపీ మిత్రులతో కలిసి వచ్చినా కూడా మోడీ ప్రధాని అయ్యే అవకాశాలు లేవని రాజకీయ పండితులు తేల్చి పారేస్తున్నారు.

ఇక తెలంగాణ విషయానికి వస్తే టీఆర్‌ఎస్‌కు కాస్త సానుకూల వాతావరణం ఉంది. అయితే కళ్లు మూసుకుని గెలిచేయవచ్చు అన్నంత ఈజీగా మాత్రం పరిస్థితి లేదు అంటూ రాజకీయ పండితులు చెబుతున్నారు. ఉద్యోగాలు వేస్తానంటూ నిరుద్యోగులను మోసం చేయడంతో పాటు, కొన్ని వర్గాల ప్రజల్లో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది. అందుకే వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడాలి అంటే అంత సులభం ఏమీ కాదు అంటూ విశ్లేషకులు అంటున్నారు. గత కొంత కాలంగా టీఆర్‌ఎస్‌కు ప్రజల్లో, నాయకుల్లో వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ఇలాంటి సమయంలోనే రాబోతున్న ఎన్నికలు టీఆర్‌ఎస్‌కు పరీక్ష అంటున్నారు.