కంగారు పెట్టిస్తున్న కారు... ఆపరేషన్ ఆకర్ష్ తో టీఆర్ఎస్ స్కెచ్ !     2018-06-25   23:12:21  IST  Bhanu C

తెలంగాణాలో తిరుగులేని పార్టీగా జెండా ఎగురవేసేందుకు టీఆర్ఎస్ పార్టీ పావులు కదుపుతోంది. అసలే ముందస్తు ఎన్నికల సంకేతాలు అందుకున్న ఆ పార్టీ అధినేత కేసీఆర్ కారు స్పీడ్ పెంచే పనిలో పడ్డారు. అందుకే ప్రతిపక్ష పార్టీల్లో బలమైన అభ్యర్థులను గుర్తించి వారిని టీఆర్ఎస్ లో చేరేలా ఆపరేషన్ ఆకర్ష్ పధకానికి కేసీఆర్ వ్యూహరచన చేసాడు. దీనిలో భాగంగానే గ్రేటర్ హైదరాబాద్ లో బలమైన నేతగా ఉన్న కాంగ్రెస్ నాయకుడు దానం నాగేంద్ర ను కారెక్కించుకున్నారు.

ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో విపక్షాల్లోని బలమైన నేతలను తన పార్టీలో చేసుకోవడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. ఎన్నికల వేళ ప్రతిపక్షాలను కంగారు పెట్టించేలా వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే టీడీపీని ఆపరేషన్‌ ఆకర్ష్‌తో తీవ్రంగా దెబ్బతీయగా… ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీపై టీఆర్‌ఎస్‌ బాస్‌ దృష్టి సారించారు. కాంగ్రెస్‌లో బలమైన నేతలుగా గుర్తింపు పొందిన నేతలపైనే టీఆర్‌ఎస్‌ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు అయినా… మాజీలు అయినా.. కారెక్కితే వారు కోరుకున్న స్థానాలను కేటాయిస్తామన్న హామీలు ఇస్తోంది.