TRS MP Suman Upset Over Vivek

ఓ జంపింగ్ జ‌పాంగ్ ఎఫెక్ట్‌తో తెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్ ఎంపీ నియోజ‌క‌వ‌ర్గానికి దూర‌మైపోయార‌ట‌. ఆ జపాంగ్‌కే వ‌చ్చే ఎన్నిక‌ల్లో సీటు ద‌క్కుతుంద‌న్న వార్త‌ల‌తో పాటు ప్ర‌స్తుతం త‌న నియోజ‌క‌వ‌ర్గంపై ఆయ‌న ప‌ట్టు సాధిస్తుండ‌డంతో కాస్త దిగాలుగా ఉన్న స‌ద‌రు ఎంపీ ఇప్పుడు త‌న నియోజ‌క‌వ‌ర్గం వైపు క‌న్నెత్తి కూడా చూడ‌డం లేద‌ట‌. పెద్ద‌ప‌ల్లి లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గం పేరు చెపితే ముందుగా గుర్త‌కు వ‌చ్చేది దివంగ‌త సీనియ‌ర్ పొలిటిషీయ‌న్ జి.వెంక‌ట‌స్వామి అలియ‌స్ కాకా.

కాకా త‌ర్వాత రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన ఆయ‌న త‌న‌యుడు వివేక్ 2009లో కాంగ్రెస్ నుంచి పెద్ద‌ప‌ల్లిలో ఎంపీగా గెలిచారు. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లోకి వెళ్లిన ఈ బ్ర‌ద‌ర్స్ కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వ‌డంతో ఎన్నిక‌ల వేళ తిరిగి కాంగ్రెస్‌లోకి వెళ్లారు. టీఆర్ఎస్ గాలిలో బ్ర‌ద‌ర్స్ ఇద్ద‌రు ఘోరంగా ఓడిపోయారు. వివేక్ అయితే ఘోరంగా రాజ‌కీయాల‌కు కొత్త అయిన విద్యార్థి సంఘం నేత బాల్క సుమ‌న్ చేతిలో ప‌రాజ‌యం పాల‌య్యాడు.

త‌ర్వాత రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌లు మ‌ళ్లీ మారాయి. కాకా సోద‌రులు ఇద్ద‌రూ మ‌ళ్లీ టీఆర్ఎస్‌లో చేర‌డంతో పెద్ద‌ప‌ల్లి రాజ‌కీయాలు యూ ట‌ర్న్ తీసుకున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వ సలహాదారు హోదాలో ఉన్న వివేక్ పెద్ద‌ప‌ల్లి లోక్‌స‌భ ప‌రిధిలో త‌న ప‌ట్టు పెంచుకుంటున్నారు. వివేక్ అనుభ‌వం ముందు తేలిపోతోన్న సుమ‌న్ ఇక్క‌డ పూర్తిగా వెన‌క‌ప‌డిపోవ‌డంతో పాటు అస్స‌లు నియోజ‌క‌వ‌ర్గంవైపు క‌న్నెత్తి కూడా చూడ‌డం లేద‌న్న టాక్ ఇక్క‌డ వినిపిస్తోంది.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో పెద్ద‌ప‌ల్లి ఎంపీ టిక్కెట్ వివేక్‌కు ఇప్ప‌టికే ఖాయ‌మైందంటున్నారు. దీంతో వివేక్ దూకుడుతో సుమ‌న్ కాస్త ఆవేద‌న‌తోనే ఉన్నార‌ట‌. ఈ విష‌యాన్ని కేసీఆర్ లేదా కేటీఆర్‌కు చెప్పినా చాలా లైట్ తీస్కొన్నార‌ట‌. ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న‌కు అసెంబ్లీ సీటు ద‌క్కుతుంద‌న్న ఆశ ఒక్క‌టే సుమ‌న్‌కు ప్ర‌స్తుతానికి మిగిలింది.