Top Telugu News Channel For Sale

రిపబ్లిక్ టీవీ పేరు చెపితే ఎన్ని సంచ‌ల‌నాల‌కు మారు పేరో అంతే విమ‌ర్శ‌ల‌కు కూడా కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలిచింది. టైమ్స్ నౌలో ఎంతో పాపులర్ అయిన అర్నాబ్ గోస్వామి నెలకొల్పిన ఛానల్ ఇది. అయితే అర్నాబ్ ఈ ఛానల్ లో ప్రధాన వాటాదారుగా కూడా ఉన్నారు. అలాగే ఈ టీవీలో ప్ర‌స్తుతం రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ఉన్న రాజీవ్ చంద్రశేఖర్ కూడా పెట్టుబ‌డిదారుడిగా ఉన్నారు. ఆయ‌న‌కు చెందిన మీడియా సంస్థ కూడా ఇందులో వాటాలు క‌లిగి ఉంది.

ఇక రాజీవ్ చంద్ర‌శేఖ‌ర్‌కు చెందిన సంస్థ ఏషియా నెట్ న్యూస్ ఆన్ లైన్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎఎన్ వోపీఎల్) ద్వారా తెలుగులో ఓ టాప్ న్యూస్ ఛానెల్‌ను కొనుగోలు చేసే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్న‌ట్టు తెలుస్తోంది. ఈ ప్ర‌య‌త్నాలు గ‌త కొద్ది రోజులుగా జోరందుకుంటున్నాయ‌ట‌. త్వ‌ర‌లోనే ఈ డీల్ ఓకే కానుంద‌ని తెలుస్తోంది.

రూ. 500 కోట్ల వ‌ద్ద ఈ డీల్‌పై చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయ‌ట‌. వాస్త‌వానికి ఆ ఛానెల్‌ను అమ్మేస్తున్నార‌ని గ‌తేడాదే ప్ర‌చారం జ‌రిగింది. ఇక ఇప్పుడు తాజా డీల్ మీడియా వ‌ర్గాల్లో పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. ఇక రిపబ్లిక్ టీవీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి బాకాలు ఊదుతూ, డ‌ప్పేస్తుంద‌న్న విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి.

ఇక సౌత్‌లో ఎలాగైనా పాగా వేయాల‌ని బీజేపీ ఎన్నో ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఈ క్ర‌మంలోనే బీజేపీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో ప‌నికివ‌చ్చేలా తెలుగులో ప్రముఖ ఛానల్ గా ఉన్న స‌దరు టీవీని కొనుగోలు చేయటం ద్వారా కొంత మేర అయినా ప్రయోజనం పొందాలని చూస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల స‌మాచారం.