రైతుల ఆత్మ‌హ‌త్య‌ల్లో తెలంగాణ టాప్‌

దేశంలో రైతు కాడి మోస్తున్నాడు.. ఏసు శిలువ మోసిన‌ట్టు! అన్నారు ప్ర‌ముఖ క‌వి గుంటూరు శేషేంద్ర శ‌ర్మ‌. దాదాపు నాలుగు ద‌శాబ్దాల కింద‌ట రైతుల క‌ష్టాన్ని ఒక్క ముక్క‌లో తేల్చి చెప్పిన శ‌ర్మ‌గారి మాట నేటికీ అక్ష‌ర స‌త్యంగా నిలుస్తూనే ఉంది. దేశ‌వ్యాప్తంగా రైతులు వ్య‌వ‌సాయం అక్క‌ర‌కు రాక ఉసురు తీసుకుంటున్నారు. ప్ర‌భుత్వాలు అన్న‌దాత‌ల కోసం ఎంతో చేశామ‌ని, ఎన్నో ప్రాజెక్టులు నిర్మించామ‌ని ఊద‌ర గొడుతున్నా.. తాజా లెక్క‌లు మాత్రం రైతుల‌కు అందుతున్న అర‌కొర స‌దుపాయాలు, వ్య‌వ‌సాయం వారికి ఉరితాడు ప‌రిణ‌మించిన వాస్త‌వాల‌నే వెల్ల‌డిస్తోంది.

రైతుల ఆర్థిక ప‌రిస్థితులు, ఆత్మ‌హ‌త్యలపై తాజాగా విడుద‌లైన రిపోర్టు ఒక‌టి తెలంగాణ‌లో రైతు దుస్థితిని స్ప‌ష్టం చేస్తోంది. తెలంగాణ రెండో ప్లేస్‌లో ఉంది. గ‌త ఏడాది అప్పుల బాధ‌తో ఓ రైతు సెక్ర‌టేరియ‌ట్‌కు స‌మీపంలో చెట్టుకు ఉరేసుకున్నాడు. ఈ సంద‌ర్భంగా స్పందించిన సీఎం కేసీఆర్‌.. ఇక నుంచి ఒక్క రైతు కూడా చ‌చ్చిపోకుండా చ‌ర్య‌లు తీసుకుంటాన‌ని ప్ర‌క‌టించారు. ఆ ప్ర‌క‌ట‌న ఉత్తుత్తిదేన‌ని తాజా గ‌ణాంకాలు స్ప‌ష్టం చేస్తున్నాయి. నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో సర్వే-2015 ప్రకారం తెలంగాణలో 1358 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు.

ఇక‌, పొరుగున ఉన్న‌ ఏపీలో 516 మంది బలవన్మరణం చెందారు. 2014లో ఈ సంఖ్య 898-160గా నమోదు అయింది. అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపు రెట్టింపు రైతులు బ‌ల‌వంతంగా ఉసురుతీసుకుంటున్న ప‌రిణామం క‌ళ్ల‌కు క‌డుతోంది.
ఈ నివేదిక ప్రకారం మహారాష్ట్రలో అత్యధికంగా 3030 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. రెండో స్థానంలో తెలంగాణ ఉంటే, కర్ణాటక మూడో స్థానంలో- చత్తీస్ ఘడ్ నాలుగో స్థానంలో మధ్యప్రదేశ్ ఐదో స్థానంలో ఉన్నాయని ఎన్ సీఆర్బీ తెలిపింది.


కర్ణాటకలో 1197 మంది అన్నదాతలు – చత్తీస్ ఘడ్ లో 854 మంది – మధ్యప్రదేశ్ లో 581మంది రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో సర్వే ప్రకారం మెజార్టీ రైతుల ఆత్మహత్యలు అప్పుల భారం – వ్యవసాయంలో ఎదురవుతున్న సమస్యల వల్లే ప్రాణాలు కోల్పోయిన‌ట్టు వెల్ల‌డించ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఇప్ప‌టికైనా ఈ సీఎంలు వాస్త‌వాల‌పై దృష్టి సారిస్తారో లేక ఒక‌రు ప్ర‌చారంలోనూ, మ‌రొక‌రు ఫాం హౌసుల్లోనూ కాలం గ‌డుపుతారో చూడాలి.