అధికార పార్టీ టిక్కెట్ రేసులో మామ‌, కోడ‌లు..!     2018-06-07   22:42:24  IST  Bhanu C

ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లా మ‌హేశ్వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయాలు అస‌క్తిక‌ర ములుపులు తిరుగుతున్నాయి. టికెట్ రేసులో మామ‌, కోడ‌లు పోటీ ప‌డుతుండ‌డం అధికార టీఆర్ఎస్‌వ‌ర్గాల‌ను ఆయోయ‌మంలోకి నెడుతోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తానే పోటీ చేస్తాన‌ని మామ అంటుంటే… ఒక‌వేళ పార్టీనుంచి మామ‌కు టికెట్ రాకుంటే తానే బ‌రిలోకి దిగుతాన‌ని కోడ‌లు అంటుండడం గ‌మ‌నార్హం. 2014ఎన్నిక‌ల్లో మహేశ్వరం నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున తీగ‌ల కృష్ణారెడ్డి విజ‌యం సాధించారు. 2009 ఎన్నిక‌ల్లో ఇక్క‌డ టీడీపీ నుంచి తీగ‌ల‌, కాంగ్రెస్ నుంచి మాజీ హోం మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి పోటీ చేశారు. ఆ ఎన్నిక‌ల్లో స‌బిత తీగ‌ల‌ను ఓడించారు. ఇక గ‌త ఎన్నిక‌ల్లో స‌బిత‌పై తీగ‌ల విజ‌యం సాధించి…. ఎప్ప‌టి నుంచో అసెంబ్లీకి వెళ్లాల‌ని అనుకుంటోన్న త‌న కోరిక నెర‌వేర్చుకున్నారు.

అనంత‌రం జ‌రిగిన రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. అయితే ఆయ‌న రాక‌ను మొద‌టి నుంచి పార్టీలో ఉన్న పాత టీఆర్ఎస్ క్యాడ‌ర్ వ్య‌తిరేకిస్తోంది. పార్టీ ఆవిర్భావం నుంచి ప‌ని చేస్తున్న తమను కాదని తీగల కృష్ణారెడ్డికి గులాబీ బాస్‌ ప్రాధాన్యం ఇవ్వ‌డాన్ని పాత క్యాడ‌ర్ జీర్ణించుకోలేకపోతోంది. గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా బరిలో దిగిన కొత్త మనోహర్‌రెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జిగా వ్యవహరించిన కప్పాటి పాండురంగారెడ్డి ఇప్ప‌టికీ తీగలపై గుర్రుగానే ఉన్నారు.