TDP Second Phase operation Akarsh

ఎన్నికలు సమీపించే తరుణంలో వైసీపీకి గట్టి దెబ్బ కొట్టాలని ఏపీ సీఎం చంద్ర‌బాబు చేయ‌ని ప్ర‌య‌త్నాలంటూ లేవు. ఇప్ప‌టికే ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ పేరుతో ఏకంగా 29 మంది ఎమ్మెల్యేల‌ను ఆయ‌న సైకిలెక్కించేసుకున్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో నలుగురికి మంత్రి ప‌ద‌వులు కూడా ఇచ్చారు. ఇక త‌మ పార్టీ ఎమ్మెల్యేలు వ‌రుస‌గా సైకిలెక్కేయ‌డంతో కాస్త డీలా ప‌డ్డ జ‌గ‌న్ ఇప్పుడు ప్లీన‌రీ త‌ర్వాత‌, ప్ర‌శాంత్ కిషోర్ ఎంట్రీ ఇచ్చాక కాస్త ఉత్తేజంతో ఉన్నారు.

ఇదిలా ఉంటే ఇప్పుడిప్పుడే పుంజుకుంటోన్న వైసీపీకి మ‌రిన్ని షాకులు ఇవ్వాల‌ని చంద్ర‌బాబు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఎట్టిపరిస్థితుల్లోను వైసీపీ బ‌లోపేతం అయ్యేందుకు చిన్న ఛాన్స్ కూడా ఇవ్వ‌కూడ‌ద‌ని భావిస్తోన్న బాబు ఇప్పుడు మ‌రో ఆప‌రేష‌న్‌కు తెర‌లేపిన‌ట్టు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే ఈ విడ‌త ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌లో గుంటూరు న‌గ‌ర ఎమ్మెల్యే ముస్త‌ఫాతో పాటు కృష్ణా జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొక్కిలిగ‌డ్డ ర‌క్ష‌ణ‌నిధి టీడీపీలో చేరేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ని వార్త‌లు వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే.