జేసీ అలిగాడా..అల్లరి చేస్తున్నాడా..ఎందుకో ఇంత రచ్చ  

పొలిటికల్ ఫెయిర్ బ్రాండ్ గా పేరు సంపాదించుకున్న అనంతపురం ఎంపీ జేసీ దివాకర రెడ్డి వ్యవహారం టీడీపీకి మింగుడుపడడంలేదు. తాను అనాలనుకున్న మాటలు అనేయడం .. తాను తిట్టాలనుకున్న వారిని తిట్టేయడం జేసీ స్టయిల్. అది సొంత పార్టీ నేతలైయినా మరెవరైనా ఆయనకు అనవసరం. ఆఖరికి సొంత పార్టీ అధినేత చంద్రబాబు కి కూడా బహిరంగంగా చురకులు వేయడం జేసీకి మాత్రమే చెల్లింది. అయితే ఈ మధ్యకాలంలో జేసీ వ్యాఖ్యలు పార్టీని చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాయి. ముగ్గతా నాయకుల విషయంలో వ్యాహరించినట్టు జేసీ విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకునే సాహసం టీడీపీ చేయదు. ఎందుకంటే అలా చేస్తే ఆ తరువాత పరిణామాలు ఎలా ఉంటాయో బాగా తెలుసు. జేసీ ధైర్యం కూడా అదే కావచ్చు.

తాజాగా జేసీ చేసిన వ్యాఖ్యలు టీడీపీ లో గందరగోళం సృష్టిస్తున్నాయి. కేంద్రంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టి బీజేపీకి వ్యతిరేకంగా పార్టీల మద్దతును కూడగట్టే పనిలో టీడీపీ ఉంది. ఈ సమయంలో పార్టీకి అండగా ఉండాల్సిన జేసీ.. చిత్రవిచిత్రమైన వ్యాఖ్యలు చేస్తూ.. కలకలం రేపుతున్నారు. అవిశ్వాస తీర్మానంపై చర్చకు తాను హాజరు కాబోవడం లేదని ప్రకటించారు. తన అసంతృప్తిని ఆయన బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ లోక్‌సభకు హాజరు కాబోనని తేల్చి చెప్పారు. ఈ విషయం చంద్రబాబుకు కూడా తెల్సి ఉండొచ్చు అంటూ చెప్పారు. అయితే జేసీ అలకకు కారణాలు ఏంటా అనే విషయం పై అందరిలోనూ చర్చ జరుగుతోంది.

అవిశ్వాస తీర్మానంపై చర్చలో ఎవరెవరు మాట్లాడాలన్న విషయంపై ఎంపీలు కసరత్తు చేశారని.. అందులో జేసీ దివాకర్‌ రెడ్డిని పరిగణనలోకి తీసుకోకపోవడం వల్లే.. ఆయన అలిగారన్న ప్రచారం జరుగుతోంది. అవిశ్వాస తీర్మానం తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించినా.. చర్చలో ఆయా పార్టీలకు లభించే సమయం మాత్రం.. పార్టీల బలాబలాల ఆధారంగానే ఉంటుంది. ఎన్ని గంటల చర్చ అన్నదాని ఆధారంగా స్పీకర్ సమయం కేటాయిస్తారు. విభజన సమస్యల విషయంలో కేంద్రం తీరును పూర్తి స్థాయిలో దేశం మొత్తానికి తెలిసేలా చేయాలంటే… హిందీ, ఇంగ్లిష్‌లలో అనర్గళంగా మట్లాడేవారిని ఎంపిక చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. దీంతో జేసీ ఆ లిస్ట్ నుంచి తప్పుకున్నారు.

టీడీపీ తరపున హిందీలో కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఇంగ్లిష్‌లో గల్లా జయదేవ్ మాట్లాడటానికి అవకాశం ఉంది. మూడో ఎంపీకి కూడా మాట్లాడే అవకాశం రావొచ్చు. ఆ అవకాశం కోసం.. ఇతర ఎంపీలు పోటీ పడుతున్నారు. ఈ విషయంలో జేసీ దివాకర్ రెడ్డి సీనియర్‌గా తనకు చాన్స్ వస్తుందని ఆశించినట్లున్నారు. కానీ దివాకర్‌ రెడ్డికి మైక్ ఇస్తే ఎలాంటి పరిస్థితి వస్తుందో అందరికీ తెలుసు కాబట్టి ఈ విషయంలో ఆయనను మొదటి రౌండ్‌లోనే పక్కన పెట్టేశారు. అందుకే.. జేసీ .. తనకు హిందీ రాదంటూ… మీడియా ముందు సెటైర్లేశారు. ఇదే జేసీ అలకకు కారణం అని తెలుస్తోంది. అందుకే ఆయన్ను బుజ్జగించే పని లో టీడీపీ ఉంది. జేసీని కంట్రోల్ చేయకపోతే టీడీపీకి మరింత చెడ్డపేరు వస్తుందనే టెన్షన్ పార్టీలో కనిపిస్తోంది .