రోజాకు టీడీపీలో ప్ర‌త్య‌ర్థి దొర‌క‌డం లేదా...!     2018-06-02   00:02:14  IST  Bhanu C

వైసీపీ ఫైర్ బ్రాండ్‌, చిత్తూరు జిల్లా న‌గ‌రి వైసీపీ ఎమ్మెల్యే ఆర్‌కె.రోజాపై వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేసే టీడీపీ అభ్య‌ర్థి ఎవ‌రు ? ఈ ప్ర‌శ్న‌కు టీడీపీలో ఆన్స‌ర్ దొర‌క‌డం లేదు. గ‌త ఎన్నిక‌ల్లో ఇక్క‌డ వైసీపీ నుంచి పోటీ చేసిన రోజా టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్ గాలి ముద్దుకృష్ణ‌మ‌నాయుడును 926 ఓట్ల మెజార్టీతో ఓడించారు. ఆ త‌ర్వాత గాలి ఎమ్మెల్సీ అయ్యి తిరిగి నియోజ‌క‌వ‌ర్గంలో ఆధిప‌త్యం సాధించారు. అనూహ్యంగా ఆయ‌న మృతి చెంద‌డంతో ఇప్పుడు న‌గ‌రిలో టీడీపీకి రోజాను ఢీకొట్టే స‌రైన లీడ‌ర్ లేకుండా పోయాడు. వాస్త‌వంగా చూస్తే ముద్దు త‌ర్వాత ఆయ‌న వార‌సులుగా ఇద్ద‌రు కుమారులు రేసులో ఉన్నారు.

వీరిద్ద‌రు ముద్దుకృష్ణ‌మ రాజ‌కీయ ప‌గ్గాల కోసం ఎవ‌రికి వారు త‌మ‌కే కావాల‌ని ప‌ట్టుద‌ల‌కు పోవ‌డంతో ముద్దు కుటుంబంలో విబేధాలు ప్ర‌స్పుట‌మ‌య్యాయి. ముద్దు మృతితో ఆ ఎమ్మెల్సీ స్థానం కోసం ఇద్ద‌రు వార‌సులు అయిన గాలి భానుప్ర‌కాశ్‌నాయుడు, జ‌గ‌దీశ్ ఇద్ద‌రూ పోటీ ప‌డ్డారు. చివ‌ర‌కు చంద్ర‌బాబు వీరి మ‌ధ్య స‌యోధ్య కుద‌ర్చ‌లేక వార్నింగ్ ఇచ్చి గాలి భార్య స‌ర‌స్వ‌త‌మ్మ‌కు ఇచ్చేశారు. ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో న‌గ‌రి అసెంబ్లీ సీటు విష‌యంలోనూ ఇప్పుడు మ‌ళ్లీ వీరిద్ద‌రు పోటీకి దిగుతున్నారు.