ఇదేంటయ్యా బాబు ! కాంగ్రెస్ అంత నచ్చేసిందా ..?  

కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్ ఫ్యూచర్ అంత కన్ఫ్యూజన్ ! అందుకే విచిత్రమైన నిర్ణయాలు తీసుకుని అందరిని అయోమయంలోకి నెట్టేస్తున్నాడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో త్రిముఖ పోరు తప్పట్లు లేదు. ఒక వైపు జనసేన, మరో వైపు వైసీపీ ప్రజల మద్దతు కూడగట్టటడంలో చాలావరకు విజయం సాధించడంతో బాబు లో కంగారు మొదలయ్యింది. అందుకే ఏ కాంగ్రెస్ కి వ్యతిరేక్మాగా అయితే టీడీపీ పుట్టిందో అదే కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు బాబు ఆరాటపడుతున్నాడు.

రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కు జరిగిన ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. అప్పట్లో అది సరైన సమయంలో సరైన నిర్ణయమే కావచ్చు. కాని నాలుగేళ్లు బీజేపీతో కలిసి ఉంది. ఇప్పుడు ఎన్నికల సమయం వచ్చేసరికి ప్రత్యేకహోదా ఇవ్వడం లేదంటూ బయటకు రావడం పార్టీకి కొంత వరకూ మైలేజీ తెచ్చి పెట్టి ఉండవచ్చు.అదే సమయంలో మోదీని తీవ్ర స్థాయిలో దుమ్మెత్తి పోస్తూ .. ఏపీ కి బీజేపీ తీరని అన్యాయం చేసిందని పడే పడే చెప్తూ ప్రజల్లో టీడీపీ సానుభూతి సంపాదించింది.

కానీ ఆ సానుభూతి అలా ఉన్న సమయంలోనే రాజకీయంగా బాబు వేసిన అడుగులు తప్పటడుగుల్లా మారడంతో ఇప్పడు విమర్శలు చెలరేగుతున్నాయి. లోక్ సభలో టీడీపీ అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతిచ్చింది. ఆ అవిశ్వాసం పెట్టడంతో చంద్రబాబు జాతీయ స్థాయిలో మరోసారి వార్తల్లోకెక్కిన మాట వాస్తవమే. కాని తాజాగా రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతును ప్రకటించడాన్ని సొంత పార్టీ నేతలే తప్పుపడుతున్నారు.

ఏపీని ఇష్టమొచ్చినట్టు విభజించి రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీని ఏపీ ప్రజలు ఎవరూ క్షమించే పనిలో లేరు. ఇప్పటికీ ఏపీ ప్రజల గుండెల్లో కాంగ్రెస్ మొదటి ముద్దాయిగానే ఉంది. రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ తో అంటకాగుతున్న తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తులో ఇబ్బందుల తప్పేలా కన్పించడం లేదు. కాంగ్రెస్ చేసిన పాపాన్ని ఇప్పట్లో కడుక్కోలేరని చంద్రబాబు పదే పదే తన ప్రసంగాల్లో నిన్న మొన్నటి వరకూ చెబుతూ వచ్చారు. అయితే బీజేపీతో తెగదెంపులు చేసుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ కి బాబు దగ్గరవ్వాల్సిన అంత అవసరం ఏముందని పలువురు టీడీపీ వీరాభిమానులు ప్రశ్నిస్తున్నారు.