అభిరామ్‌తో చేయాలనుకున్నది రానాతో  

దగ్గుబాటి ఫ్యామిలీకి టాలీవుడ్‌లో మంచి పేరుంది. కింది స్థాయి నుండి ఉన్నత స్థాయికి ఎదిగిన రామానాయుడు వారసులుగా సురేష్‌బాబు, వెంకటేష్‌లు ఇండస్ట్రీలో గౌరవంగా ముందుకు సాగుతున్నారు. హీరో వెంకటేష్‌ విషయాన్ని పక్కకు పెడితే నిర్మాత సురేష్‌బాబు సినిమా పరిశ్రమకు పెద్ద దిక్కు అన్నట్లుగా వ్యవహరిస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇలాంటి సమయంలో ఆయన చిన్న కొడుకు అభిరామ్‌ విషయంలో శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన పరువు తీశాయి. ఎంతో కాపాడుకుంటూ వస్తున్న పరువు, ప్రతిష్టలను శ్రీరెడ్డి రెండు ఫొటోలు విడుదల చేసి గంగ పాలు చేసిందనే ఆవేదన సురేష్‌బాబులో ఆ మద్య వ్యక్తం అయ్యింది. హీరో అవ్వాలని ఉవ్విల్లూరిన అభిరామ్‌ ప్రస్తుతం అజ్ఞాతంలోకి వెళ్లి పోయాడు.

శ్రీరెడ్డి ఎఫెక్ట్‌తో కొన్నాళ్లుగా కనీసం కనిపించడం కూడా మానేసిన అభిరామ్‌ ఇక సినిమాల్లోకి ఏం వస్తాడు చెప్పండి. ఈ సంవత్సరం అభిరామ్‌ హీరోగా తరుణ్‌ భాస్కర్‌ దర్శకత్వంలో ఒక చిత్రాన్ని చేయాలని సురేష్‌బాబు భావించాడు. అందుకోసం కొన్ని నెలల క్రితమే ఒక స్క్రిప్ట్‌ను కూడా అనుకున్నారు. అయితే ప్రస్తుతం పరిస్థితి మారిపోయింది. ఆ చిత్రాన్ని ఇప్పుడు అభిరామ్‌తో చేసే పరిస్థితి లేదు. కొన్నాళ్ల వరకు అభిరామ్‌ బయటకు వచ్చేందుకు సురేష్‌బాబు నో చెబుతున్నాడు. దాంతో ఆ ప్రాజెక్ట్‌ను రానాతో చేసేందుకు రంగం సిద్దం అయ్యింది.