సైరా ఆలస్యం.. కేవలం పబ్లిసిటీ స్టంటా?     2018-06-19   00:04:16  IST  Raghu V

మెగాస్టార్‌ చిరంజీవి 150వ సినిమా ‘ఖైదీ నెం.150’ భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ఆయన నుండి రాబోతున్న తర్వాత సినిమాపై సహజంగానే అంచనాలు భారీగా ఉంటాయి. చిరు 150వ చిత్రం విడుదలైన ఆరు నెలల్లోనే కొత్త సినిమాతో వస్తాను అంటూ ఫ్యాన్స్‌కు అప్పుడు మాట ఇచ్చాడు. కాని ఆ మాటపై చిరంజీవి నిలబడలేక పోయాడు. ఖైదీ నెం.150 సినిమా విడుదలైన రెండు సంవత్సరాల తర్వాత కూడా ఆయన 151వ చిత్రం విడుదల అయ్యే అవకాశం లేదని తేలిపోయింది. ప్రస్తుతం చిరంజీవి 151వ చిత్రం సైరా నరసింహారెడ్డి తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. ఆ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుపుతున్నారు.

చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా గురించి సంవత్సర కాలం చర్చలు జరిపి ఎట్టకేలకు గత సంవత్సరం చివర్లో సెట్స్‌ పైకి తీసుకు వెళ్లారు. అయితే కొన్ని కారణాల వల్ల సినిమా మెల్లగా చిత్రీకరణ జరుపుకుంటుంది. భారీ స్థాయిలో అంచనాలున్న సైరా నరసింహారెడ్డిలో ప్రముఖ స్టార్స్‌ నటిస్తున్న కారణంగా వారి డేట్లు ఇబ్బందికరంగా ఉన్నాయి. అందుకే షూటింగ్‌ ఆలస్యం అవుతున్నట్లుగా సమాచారం అందుతుంది. మొత్తానికి చిరంజీవి 151వ చిత్రం విడుదల ఇప్పట్లో లేదని చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. సినిమా విడుదల ఆలస్యం వెనుక పబ్లిసిటీ స్టంట్‌ ఉందంటూ కొందరు విశ్లేషిస్తున్నారు.