సుశాంత్‌ మరీ ఇంత దురదృష్టవంతుడా     2018-08-06   11:23:07  IST  Ramesh P

అక్కినేని వారి మనవడు సుశాంత్‌ హీరోగా చాలా కాలం క్రితమే పరిచయం అయ్యాడు. హీరోగా దశాబ్దకాలంగా సినిమాలు చేస్తున్నా కూడా ఇప్పటి వరకు సుశాంత్‌కు సక్సెస్‌ అనేది దక్కలేదు. కమర్షియల్‌ సక్సెస్‌ కోసం చకోరా పక్షి తరహాలో ఎదురు చూస్తున్న ఈ అక్కినేని హీరో ఈమద్య సినిమాల సంఖ్య బాగా తగ్గించి, చాలా జాగ్రత్తలు తీసుకుంటూ సినిమాలు చేస్తున్నాడు. తాజాగా ఈయన చిలసౌ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. హీరో అయిన రాహుల్‌ రవీంద్రన్‌ ఈ చిత్రంతో దర్శకుడిగా మారాడు. ఈ చిత్ర ఫలితం చూస్తుంటే సుశాంత్‌ ఎంత దురదృష్టవంతుడో చెప్పకనే చెప్పొచ్చు.

Chi La Sow Movie Review,Sushanth,Sushanth Movie Chi La Sow Movie Gets Low Collections

సుశాంత్‌ నటించిన చిలసౌ చిత్రానికి విమర్శకుల నుండి ప్రశంసలు దక్కుతున్నాయి. విడుదల రోజే మంచి రేటింగ్స్‌ వచ్చాయి. మల్టీప్లెక్స్‌ థియేటర్ల ప్రేక్షకులు ఈ సినిమా బాగుందంటూ టాక్‌ చెప్పారు. అయినా కూడా సినిమాకు ఏమాత్రం కలెక్షన్స్‌ దక్కడం లేదు. చాలా రోజులుగా ఎదురు చూస్తున్న సక్సెస్‌ దక్కిందని సుశాంత్‌ ఆనందపడుతున్న సమయంలోనే బాక్సాఫీస్‌ రిపోర్ట్‌ ఆయనకు కన్నీరు తెప్పించే విధంగా ఉందని ట్రేడ్‌ పండితులు చెబుతున్నారు. ఏమాత్రం సినిమా కలెక్షన్స్‌ పరంగా ప్రభావం చూపించలేక పోతుందని సమాచారం అందుతుంది.

చిలసౌ చిత్రం 4 కోట్ల బడ్జెట్‌తో రూపొందింది. సినిమా బడ్జెట్‌ను రికవరీ చేయాలి అంటే కనీసం మూడు కోట్ల రూపాయలను వసూళ్లు చేయాలి. మరో కోటి రూపాయలు ఇతర రైట్స్‌ ద్వారా నిర్మాతకు వస్తాయి. కాని కలెక్షన్స్‌ రూపంలో ఈ చిత్రానికి కోటిన్నర రూపాయలు కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు అంటూ ట్రేడ్‌ పండితులు చెబుతున్నారు. మొదటి రోజు 40 లక్షల షేర్‌ను దక్కించుకున్న ఈ చిత్రం ఆ తర్వాత రెండు రోజుల్లో కూడా 60 లక్షల షేర్‌ను రాబట్టలేక పోయిందని, ఇప్పటి వరకు కోటి వరకు దక్కించుకున్న ఈ చిత్రం ఇక వీక్‌ డేస్‌లో వసూళ్లను సాధించడం అసాధ్యం అంటున్నారు.

Chi La Sow Movie Review,Sushanth,Sushanth Movie Chi La Sow Movie Gets Low Collections

ఈ చిత్రం కేవలం మల్టీప్లెక్స్‌ థియేటర్లలో మాత్రమే ఆడుతుంది. వారాంతాల్లో మాత్రమే మల్టీప్లెక్స్‌లు సందడిగా ఉంటాయి. అంటే ఈ చిత్రం ఇక వసూళ్లు రాబట్టడం కష్టమే అంటున్నారు. ఇప్పటికే వచ్చిన కోటికి అదనంగా పది లేదా పదిహేను లక్షల వరకు రావచ్చు అంటూ ట్రేడ్‌ వర్గాల వారు అంటున్నారు. సినిమాకు సక్సెస్‌ టాక్‌ వచ్చినా, రివ్యూలు పాజిటివ్‌ వచ్చినా కూడా మరీ ఇంతటి దారుణమైన పరిస్థితి ఎదుర్కోవడం ఏంటని సినీ వర్గాల వారు సుశాంత్‌పై జాలి చూపుతున్నారు.