సుధీర్‌బాబుకు మరో 5 ఏళ్లు ఇబ్బంది లేదు     2018-06-16   04:16:22  IST  Raghu V

మహేష్‌బాబు అండదండతో హీరోగా పరిచయం అయిన సుధీర్‌బాబు కెరీర్‌ ఆరంభం నుండి మంచి సక్సెస్‌లను దక్కించుకోవడంలో విఫలం అవుతూ వస్తున్నాడు. మారుతి దర్శకత్వంలో వచ్చిన ‘ప్రేమకథా చిత్రమ్‌’ మినహా సుధీర్‌బాబుకు ఇప్పటి వరకు పర్వాలేదు అన్న సినిమానే పడలేదు. ఇన్నాళ్లకు మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో వచ్చిన ‘సమ్మోహనం’ చిత్రం ఒక మోస్తరు సక్సెస్‌ను ఈయనకు తెచ్చి పెట్టింది. అదితి రావుతో ఆ సినిమాలో ఈయన చేసిన రొమాన్స్‌ సినిమాకు హైలైట్‌గా నిలిచింది. భారీ అంచనాల నడుమ రూపొందిన సమ్మోహనం చిత్రం అంచనాలను అందుకుంది.

సుధీర్‌బాబు వరుసగా సినిమాలు చేయడం, అవి బాక్సాఫీస్‌ వద్ద బొక్క బోర్లా పడటం జరుగుతుంది. అయినా కూడా నిరాశ పడకుండా సినిమాలు అయితే చేస్తున్నాడు. సినిమాలు చేయగా చేయగా ఈయనకు ఆఫర్లు ఇచ్చేందుకు నిర్మాతలు ముందుకు రావడం లేదు. దాంతో చేసేది లేక సొంతగా ఒక బ్యానర్‌ను ఈయన స్థాపించాడు. ఎస్‌బి పిక్చర్స్‌ అంటూ సుధీర్‌బాబు ప్రారంభించిన ఆ బ్యానర్‌లో ఇకపై వరుసగా సినిమాలు నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. ఇలాంటి సమయంలో సమ్మోహనం చిత్రం సక్సెస్‌ అవ్వడంతో ఈయనతో సినిమాలు నిర్మించేందుకు నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు.