టీటీడీ పై స్వామి యుద్ధ..ఆయుధాలు రెడీ    2018-07-10   23:39:07  IST  Bhanu C

టీటీడీ లో అక్రమాలు జరిగిపోతున్నాయంటూ కొద్దీ రోజుల ముందు వివాదాలు చెలరేగాయి. ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా పెద్ద సంచలనం సృష్టించింది. టిటిడిలో రాష్ట్ర ప్రభుత్వ పెత్తనం ఎక్కువగా ఉందంటూ, దీన్ని తొలగించాలంటూ సుప్రీంకోర్టులో కేసు వేస్తానని సుబ్రమణ్యస్వామి ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన పిటిషన్‌ను సుబ్రమణ్యస్వామి బృందం తయారు చేస్తోంది. పిటిషన్‌ సిద్ధమయిందని, త్వరలో కోర్టు ముందుకు తీసుకెళుతానని ఆయన చెబుతూ వస్తున్నారు. దానికి ఈ నెల 19న (జులై19, 2018) ముహూర్తం నిర్ణయించినట్లు సమాచారం.

శ్రీవారి నగలు మాయమవుతున్నాయని, పోటులో తవ్వకాలు జరిగాయని, స్వామివారికి కైంకర్యాలు సరిగా జరగడం లేదని ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన్ను 24 గంటల్లో ప్రధాన అర్చక పదవి నుంచి తొలగించారు. రిటైర్‌మెంట్‌ కూడా ఇచ్చారు. అప్పటి నుంచి టిటిడి జాతీయ స్థాయిలో వార్తల్లో ఉంది. ఈ నేపదాయంలో ఈ వివాదంలోకి దూరిన సుబ్రమణ్య స్వామి కోర్టు వరకు ఈ వ్యవహారాన్ని తీసుకెళ్తున్నాడు.

ఎంపీ సుబ్రమణ్యస్వామి వేయబోయే పిటిషన్‌ ఇప్పుడు అత్యంత కీలకం కాబోతోంది. ఎందుకంటే దేవాలయాలకు సంబంధించిన అనేక అంశాలు ఇందులో చర్చకు రాబోతున్నాయి. పురాతన కట్టడాల పరిరక్షణ, వంశపారంపర్య అర్చకత్వం, ఇతర సేవలు; దేవుళ్ల ఆస్తులు-ఆభరణాల పరిరక్షణ, ప్రభుత్వాల జోక్యం, ఆలయ సంప్రదాయాలు వంటి అంశాలపైన విచారణ జరగనుంది. దేవాలయాలకు సంబంధించి అనేక చట్టాలున్నాయి. వాటి ఆధారంగానే స్వామి పిటిషన్‌ దాఖలు చేస్తున్నారు.

సుప్రీంలో వేసే పిటిషన్‌ అంటే శమాషిగా ఉండకూడదు. అత్యంత పకడ్బందీగా ఉండాలి. అందుకే సుబ్రమణ్యస్వామి ఇందుకోసం దాదాపు రెండు నెలల సమయం తీసుకున్నారు. రమణ దీక్షితులు సహకారంతో టిటిడి వ్యవహారాలను తెలుసుకున్నారు. రమణ దీక్షితులును పదవిలో కొనసాగించడం అనేది ఇందులో చివరి అంశమే కాబోతోంది.

సుబ్రమణ్యస్వామికి న్యాయవాదిగా ఉన్న పేరుప్రఖ్యాతలను దృష్టిలో ఉంచుకుని ఆయన పిటిషన్‌ ఎలా వుండబోతోంది అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇదిలావుండగా ఇప్పటికే ఈ వ్యవహారం రాష్ట్ర హైకోర్టులో ఉంది. ఇద్దరు వ్యక్తులు దాఖలు చేసిన ప్రజాప్రయోజనాల వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించింది. ప్రాధమిక వాదనలు జరిగాయి.
పూర్తి వివరాలతో అఫిడవిట్‌ దాఖలు చేయాలని టిటిడిని న్యాయస్థానం ఆదేశించించింది. తాజాగా సుబ్రమణ్య స్వామి పిటిషన్ కోర్టు మెట్లు ఎక్కబోతుండడంతో ఇప్పుడు ఈ వ్యవహారం ఏపీలో రాజకీయ పార్టీల మధ్య ప్రకంపనలు సృష్టించే అవకాశం కనిపిస్తోంది.