సినిమాకే కాదు, టైటిల్‌కూ న్యాయం జరగలేదు     2018-06-23   02:34:25  IST  Raghu V

ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో నరేష్‌, ఆమనిలు హీరో హీరోయిన్స్‌గా బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, అలీ ఇంకా పలువురు ప్రముఖ కమెడియన్స్‌ నటించిన చిత్రం ‘జంబ లకిడి పంబ’. అప్పట్లో సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న ఆ చిత్రం, తెలుగు సినిమా చరిత్రలో క్లాసిక్‌గా మిగిలి పోయింది. ఇప్పటికి కూడా ఆ సినిమా టీవీల్లో వస్తూ ఉంటే ప్రేక్షకులు టీవీలకు అతుక్కు పోతారు. ఈ తరం వారికి కూడా బాగా నచ్చిన ‘జంబలకిడి పంబ’ చిత్రంను తాజాగా అదే టైటిల్‌తో రీమిక్స్‌ చేసేందుకు శ్రీనివాస రెడ్డి ప్రయత్నాలు చేశాడు, ఆ ప్రయత్నం అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యింది.

‘జంబ లకిడి పంబ’ చిత్రంను అల్లరి నరేష్‌తో సీక్వెల్‌ చేయడానికి లేదా రీమేక్‌ చేయడానికి చాలా మంది ప్రయత్నించారు. కాని అల్లరి నరేష్‌ తన తండ్రి తప్ప ఆ సబ్జెక్ట్‌కు ఇప్పుడు ఎవరు న్యాయం చేయలేరు అంటూ గట్టిగా నమ్మాడు. అందుకే రీమేక్‌కు లేదా సీక్వెల్‌కు ఆసక్తి చూపించలేదు. అల్లరి నరేష్‌ ఆసక్తిగా లేకపోవడంతో కమెడియన్‌ శ్రీనివాసరెడ్డి సీక్వెల్‌కు ముందు అడుగు వేశాడు. జంబ లకిడి పంబను ఎలా చేసినా ప్రేక్షకులు ఆధరిస్తారని భావించినట్లుగా ఉన్నారు. పెద్దగా కథ లేకుండానే అప్పటి స్టోరీ లైన్‌ను తీసుకుని ఈ చిత్రాన్ని చేయడం జరిగింది.