శ్రీనువైట్లకు కారిపోతుందట     2018-05-27   01:19:01  IST  Raghu V

మాస్‌ మహారాజా రవితేజ ప్రస్తుతం శ్రీనువైట్ల దర్శకత్వంలో ‘అమర్‌ అక్బర్‌ ఆంటోనీ’ చిత్రాన్ని చేస్తున్న విషయం తెల్సిందే. ఈ చిత్రంలో రవితేజ మూడు విభిన్న గెటప్స్‌లలో కనిపించబోతున్నాడు. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్‌ ఎక్కువ శాతం అమెరికాలో నిర్వహిస్తున్నారు. దాంతో పాటు స్టార్‌ హీరోయిన్స్‌ ఇలియానా మరియు శృతిహాసన్‌లు నటిస్తున్నారు. ఈ ఇద్దరికి కలిపి ఏకంగా మూడు కోట్ల పారితోషికంను ఇస్తున్నారు. మొత్తంగా ఈ చిత్రం బడ్జెట్‌ రవితేజ స్థాయిని దాటేస్తుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయినా కూడా పర్వాలేదు అని నిన్నమొన్నటి వరకు శ్రీనువైట్ల భావిస్తూ వచ్చాడు.

తాజాగా రవితేజ నటించిన ‘నేలటిక్కెట్టు’ చిత్రం అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యింది. దాంతో ఇప్పుడు రవితేజ తర్వాత సినిమా అంటే ప్రేక్షకులు మరియు డిస్ట్రిబ్యూటర్లు అంతగా ఆసక్తి చూపడం లేదు. అమర్‌ అక్బర్‌ ఆంటోనీ చిత్రాన్ని కొనుగోలు చేసేందుకు డిస్ట్రిబ్యూటర్లు ముందుకు వచ్చే పరిస్థితి లేదు. దాంతో దర్శకుడు శ్రీనువైట్ల తెగ టెన్షన్‌ పడిపోతున్నాడు. డిస్ట్రిబ్యూటర్‌లు రాకుంటే దర్శకుడికి వచ్చిన సమస్య ఏంటా అని భావిస్తున్నారా.. ఈ చిత్రం నిర్మాణ భాగస్వామిగా శ్రీనువైట్ల వ్యవహరిస్తున్నాడు. ఈ చిత్రం కోసం శ్రీనువైట్ల పారితోషికం తీసుకోక పోవడంతో పాటు తన ఆస్తిని కుదువ పెట్టి దాదాపు 6 కోట్ల రూపాయలను సినిమాకు ఖర్చు చేశాడట.