స్పైడర్ మళ్ళీ లీక్ బారిన పడింది, భయంలో పంపిణిదారులు

స్పైడర్ కి సంబంధించి ఏదైనా ఒక్క మంచి విషయం ఈ మధ్య జరిగిందా అంటే అసలేం జరిగిందో ఎవరికీ తట్టట్లేదు. 160 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అని గొప్పలు చెప్పుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ సినిమా బిజినెస్ కూడా అదే రేంజ్ లో జరిగేలా ఉంది. అంటే స్పైడర్ బిజినెస్ కూడా ఆ సినిమా స్థాయికి తగ్గట్టుగా జరగలేదు అన్నమాట. సరే, బిజినెస్ ఎప్పుడో మొదలైంది కాబట్టి, ఏ పెద్ద హీరో బిజినెస్ ని మరో పెద్ద హీరో సినిమా కొట్టడం కామన్ కాబట్టి, రేపు భరత్ అనే నేను ఆ రికార్డుని కొట్టే అవకాశాలు ఉంటాయి కాబట్టి, ఈ టాపిక్ వదిలేద్దాం.

ఒక్కటంటే ఒక్క పోస్టర్ కూడా ఎవరిని ఆకట్టుకోలేకపోయింది. అవి ఇటు తెలుగు సినిమా పోస్టర్స్ లా లేవు, అటు హాలివుడ్ స్థాయిలో లేవు. టీజర్ రిలీజ్ కి ముందే లీక్. ఇంకేం వస్తాయి యూట్యూబ్ రికార్డులు. ట్రైలర్ ఇవాలా ఫంక్షన్ లో రిలీజ్ చేద్దామనుకుంటే అది కూడా నిన్న రాత్రే లీక్. దాంతో చేసేదేమీ లేక, అర్థరాత్రి సడెన్ గా ట్రైలర్ ని విడుదల చేసారు.