బిగ్‌బాస్‌ 2 నాని హోస్టింగ్‌పై సోషల్‌ కామెంట్స్‌     2018-06-18   03:09:48  IST  Raghu V

హిందీ బుల్లి తెరపై సంచన విజయాన్ని సొంతం చేసుకున్న బిగ్‌బాస్‌ను గత సంవత్సరం తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. మొదటి సీజన్‌కు ఎన్టీఆర్‌ హోస్ట్‌గా వ్యవహరించాడు. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ తన ఎనర్జితో బిగ్‌బాస్‌ను అద్బుతంగా ఆవిష్కరించాడు. షో మొదటి సీజన్‌ అవ్వడంతో పాటు, ఎన్టీఆర్‌ హోస్టింగ్‌ అవ్వడం వల్ల భారీ టీఆర్పీ రేటింగ్‌ దక్కింది. తెలుగులో ఇంత భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందని స్టార్‌ మా వారు కూడా ఊహించలేదు. అంతటి విజయాన్ని సొంతం చేసుకోవడంతో సహజంగానే రెండవ సీజన్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా వస్తాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన బిగ్‌బాస్‌ తాజాగా ప్రారంభం అయ్యింది.

బిగ్‌బాస్‌ సీజన్‌ 2కు ఎన్టీఆర్‌ హోస్టింగ్‌ చేయలేను అంటూ తేల్చి చెప్పాడు. సినిమాతో బిజీగా ఉన్న కారణంగా ఎన్టీఆర్‌ షో నుండి తప్పుకున్నాడు. ఎన్టీఆర్‌ స్థానంలో ఎవరైతే బాగుంటుందని భావిస్తున్న సమయంలో ఆసక్తికరంగా నాని పేరు బయటకు వచ్చింది. నాని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సహజ నటుడిగా పేరున్న నాని హోస్ట్‌ పాత్రను కూడా మడతపెట్టి మరీ చేసేస్తాడు అని అంతా భావించారు. కాని అనూహ్యంగా బుల్లి తెరపై బిగ్‌బాస్‌ను ఆశించిన స్థాయిలో ఆయన నడిపించడంలో విఫలం అవుతున్నాడు అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.