అక్కా, తమ్ముడికి లింకులు పెట్టే రకం మీరు అంటూ ఫైర్ అయిన నటి ప్రియాంక.!  

‘‘మీకు పనీపాట లేదా? మంచిగా హ్యాపీగా డీసెంట్‌గా వర్క్ చేసుకుని బతకొచ్చు కదా? నేను దెయ్యాన్నా? ఆత్మనా? నేను చచ్చిపోయానా? వ్యూస్ కోసం, మనీ కోసం జనాలను చంపేస్తారా?’’ అంటూ యాంకర్, నటి ప్రియాంక నల్కర్ యూట్యూబ్ చానెల్స్ మీద ఫైర్ అయ్యారు. తమ రేటింగ్స్‌ కోసం, వ్యూస్‌ కోసం యూట్యూబ్‌ చానల్స్‌ ఎన్ని అడ్డదారులైనా తొక్కుతాయంటూ నటి ప్రియాంక మండిపడ్డారు. డబ్బుల కోసం, వ్యూస్‌ కోసం అక్కాతమ్ముడికి కూడా లింకులు పెట్టేరకం మీరు అంటూ యూట్యూబ్‌ వీడియోలపై ఆమె స్పందించారు. నిజాయితీగా తమ పని చేసుకునే వారిని డిస్టర్బ్‌ చేయొద్దని సూచించారు. తనపై ఇటీవల వచ్చిన వదంతులకు ఫుల్‌స్టాప్‌ పెట్టడానికి ప్రియాంక ఓ వీడియో పోస్ట్‌ చేయగా ఆ వీడియో వైరల్‌గా మారింది.

ఇటీవల తమిళ బుల్లితెర నటి ప్రియాంక ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే, కొన్ని యూట్యూమ్‌ చానళ్లు తెలుగు నటి ప్రియాంక ఆత్మహత్య చేసుకుందంటూ ఫేక్ న్యూస్ సృష్టించారు. ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ప్రియాంక బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆమెకు ఫోన్ కాల్స్ వస్తుండటంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యారు.

ఈ వదంతులను ఆపేందుకు ఆమె లైవ్ వీడియోలో మాట్లాడారు. ‘‘నా ఫొటో పెట్టి బుల్లి తెర నటి ప్రియాంక ఆత్మహత్య అని పెట్టిన వీడియోను వెంటనే డిలీట్ చేయండి. మా ఫ్యామిలీవారు ఎవరైనా చూసి హార్ట్ ఎటాక్ వచ్చి చనిపోతే దానికి మీరు బాధ్యత వహిస్తారా? మీ వ్యూస్ కోసం పెట్టిన తప్పుడు వార్తకు ఎంతమంది బాధపడతారో తెలుసా? మీ రేటింగ్స్ కోసం అక్కా తమ్ముళ్లకు కూడా లింకులు పెట్టే టైపు మీరు’’ అని ధ్వజమెత్తారు.