ఏడాదికి సిగరేట్ల బిజినెస్‌ ఎంత, చనిపోతున్నవారు ఎంతమంది?  

స్మోకింగ్ .. ఆదాయ తరగతుల భేదం లేకుండా ఉండే వ్యసనం. కాల్చే సిగరేట్ పరిమాణం, కంపెనీ మారిపోతుందేమో కాని, అందరు పీల్చేది అదే విషాన్ని. నికోటిన్ ని శరీరంలో నింపేసి, ఎన్నో సమస్యలు కొనితెచ్చుకోని మరణశయ్యపైకి ఎక్కుతున్నవారు ఏడాదికి లక్షల్లో ఉన్నారు. మరి ఎంతమంది చనిపోతున్నారో తెలుసా?

ఏడాదికి కనీసం 6 మిలియన్ల జనాభా కేవలం సిగరెట్ అలవాటు వలనే పైలోకాలకి వెళ్ళిపోతున్నారట. అసలు సిగరెట్ వ్యాపారం యొక్క రెవెన్యూ ఎంత ఉంటుందో తెలుసా? అక్షరాల 269 బిలియన్ డాలర్లకు పైమాటే.

ఇవేవో ఉత్తుత్తి గాలి లెక్కలు కావు. యుఎస్ నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అందించిన రిపోర్టు ఫలితాలు. ఇక్కడికే నోళ్ళు వెళ్లబెట్టేసారేమో .. అసలు కథ వినండి. సిగరెట్ బిజినెస్‌ త్వరలోనే ఒక ట్రిలియన్ డాలర్లను దాటనుందట. అంతేకాదు, 2030 నాటికి, కేవలం ధూమపానం అలవాటు వలన ఏడాదికి ఏకంగా 8 మిలియన్ల మంది చనిపోతూ ఉంటారని చెబుతోంది అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్.

సిగరెట్లు ఎందుకు మానేయ్యాలో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. కనీసం ఈ లెక్కలైనా, సిగరెట్ అలవాటు ఉన్నవారిలో కొంచెం భయాన్ని కలిగించినా సంతోషం.