Sharukh passes his bad luck to Salman

ఒకప్పుడు బాలివుడ్ లో సినిమా ఆడాలంటే అయితే అందులో షారుఖ్ ఖాన్ ఉండాలి లేదంటే శృంగారం ఉండాలి అని అనేవారు. షారుఖ్ అంటేనే బాలివుడ్, బాలివుడ్ అంటేనే షారుఖ్. కింగ్ ఖాన్, బాలివుడ్ బాద్షా. అయితే గతం గతః. ఇప్పుడు షారుఖ్ కి అంత సీన్ ఉంది అంటే స్వయంగా షారుఖ్ కూడా నమ్మడు. ఏ ముహూర్తాన తగులుకున్నాడో ఆమీర్ ఖాన్, 2008 నుంచి మొదలు, మరో హీరోకి ఛాన్స్ ఇవ్వలేదు. ముఖ్యంగా షారుఖ్ నుంచి ఆ నెం.1 ర్యాంకు లాక్కోని, ఎవరికి అందనంత దూరంలో కూర్చున్నాడు. అయితే షారుఖ్ డీలాపడిపోయినట్లు సల్మాన్ ఢీలాపడిపోలేదు. ఆమీర్ ఎలాగో రెండు సంవత్సరాలకి ఓసారి వస్తాడు. ఈ గ్యాప్ లో హవా అంత సల్మాన్ దే.

రెడి, దబాంగ్, బాడిగార్డ్, దబాంగ్ 2, కిక్, బజరంగీ భాయిజాన్, సుల్తాన్ ఇలా వరుస బ్లాక్బస్టర్లు కొట్టాడు సల్మాన్. కాని భాయ్ స్పీడ్ కి ఇప్పుడు బ్రేక్ పడింది. కొత్తగా వచ్చిన ట్యూబ్ లైట్ దారుణమైన పరాజయం పాలవుతోంది. నాలుగు రోజుల్లో కేవలం 80 కోట్ల నెట్ సాధించిన ట్యూబ్ లైట్, షేర్ కలెక్షన్ల విషయంలో డిజే – దువ్వాడ జగన్నాథం కంటే వెనుకబడి ఉండటం విశేషం. అసలు మొదటిరోజు కలెక్షన్లలో కూడా సల్మాన్ సినిమాని డామినేట్ చేసింది డీజే. అందుకే “Allu beats Sallu” అంటూ సోషల్ మీడియాలో కొత్త వాక్యాలు పుట్టుకొస్తున్నాయి. ఇదిలా ఉంటే ట్యూబ్ లైట్ కి ఇంత తక్కువ కలెక్షన్లు రావడానికి షారుఖ్ కారణం అంటూ వాదిస్తున్నారు కొందరు. అదేంటి .. సల్మాన్ సినిమాకి షారుఖ్ చేసిన నష్టం ఏమిటి అని ఆశ్చర్యపోతున్నారా ?

విషయం ఏమిటంటే ట్యూబ్ లైట్ లో షారుఖ్ అతిథి పాత్ర పోషించాడు. అందుకే షారుఖ్ శని సల్మాన్ కి అంటుకుందని వింతవాదన చేస్తున్నారు. ఇదే మాటను కొందరు బాలివుడ్ సెలబ్రిటీలు కూడా వాడటం ఆశ్చర్యకరం. పేరుకే హై ఫ్రొఫైల్ సినిమా వారిది. కాని ఈ జాతకాలు, సెంటిమెంట్స్ ని అందరికన్నా ఎక్కువ నమ్మేది, పట్టించుకునేది వాళ్ళే.