బాబు వ్యాఖ్య‌ల‌పై వ్యంగ్యాస్త్రాలు.. రీజ‌నేంటి?     2018-06-09   03:27:06  IST  Bhanu C

ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబు న‌వ‌నిర్మాణ దీక్ష వారోత్సవం సంద‌ర్భంగా ఎక్క‌డ ఏ వేదిక దొరికినా.. నాకు ఓట్లేయండి.. న‌న్ను గెలిపించండి! నా పార్టీకి అధికారం ఇవ్వండి! నా 25 మంది ఎంపీల‌ను గెలిపించండి! అని ప‌దే ప‌దే పిలుపునిస్తున్నారు. అయితే, ఈ వ్యాఖ్య‌ల తీవ్రత అనుకున్న దానిక‌న్నా మోతాదు మించిందో ఏమో.. సోష‌ల్ మీడియాలో స‌టైర్లు పేలుతున్నాయి. బాబు బ‌హు మాట‌కారి! అని కొంద‌రు అంటుంటే.. మ‌రికొంద‌రు మాత్రం.. ఇన్ని సార్లు అడుక్కో వ‌డం ఏంటి బాబూ.. టైం వ‌చ్చిన‌ప్పుడు మేమే వేస్తాంలే!! అని మ‌రికొంద‌రు పెద‌వి విరుస్తున్నారు. ఇక‌, మూడో త‌ర‌హా ప్ర‌జ‌లు మ‌రికాస్త‌ముందుకు వెళ్లి.. మీరు ఇన్నిసార్లు చెప్పుకొంటుంటే.. ఏదో తెలియ‌ని అనుమానాలు వ‌స్తాయ‌ని చుర‌కలు అంటించ‌డం మ‌రో విశేషం.

మొత్తంగా ఈ ప‌రిణామాలు గ‌డిచిన రెండు రోజులుగా సోష‌ల్ మీడియాలో విస్తృతంగా ప్ర‌చారం అవుతున్నాయి. వీటిని టీడీపీ సోష‌ల్ మీడియా కొంత వ‌ర‌కు ఎవాయిడ్ చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నా.. వైసీపీ ప్రోద్బ‌ల‌మో.. లేదా.. ప్ర‌జాస్పంద‌నో తెలియ‌దు కానీ.. సైట‌రిక‌ల్ కామెంట్లు మాత్రం పెరుగుతున్నాయి. ఏపీకి కేంద్రం ప్ర‌భుత్వం అన్యాయం చేసింద‌ని, అయినా తాను ఎంతోక‌ష్ట‌ప‌డి రాష్ట్రాన్ని పైకి తెస్తున్నాన‌ని చంద్ర‌బాబు గ‌డిచిన రెండు మూడు నెల‌లుగా పెద్ద ఎత్తున ప్ర‌చారం చేస్తున్నారు. ధ‌ర్మ‌పోరాట దీక్ష అని, ధ‌ర్మ‌పోరాట సైకిల్ యాత్ర‌ల‌ని, ధ‌ర్మ‌పోరాట దీక్ష స‌భ‌ల‌ని, ప్ర‌స్తుతం న‌వ‌నిర్మాణ దీక్ష‌లని ఆయ‌న చేస్తున్న కార్య‌క్ర‌మాల‌కు విభిన్న పేర్లు పెడుతున్నా.. సారాంశం మాత్రం కేంద్రంలోని న‌రేంద్ర మోడీని, రాష్ట్రంలోని వైసీపీ అధినేత జ‌గ‌న్‌ను విమ‌ర్శించ‌డమే!