Sampoornesh to pay huge fine for leaving Bigg Boss

బిగ్ బాస్ షో మొదలైనరోజు అక్కడ ఎన్టీఆర్ తరువాత అతిపెద్ద స్టార్ ఎవరు అంటే అది సంపూర్నేష్ బాబే. సంపూ బిగ్ బాస్ ఇంట్లోకి వస్తున్నాడు అని తెలియగానే అందరిలో ఎదో ఆసక్తి. వారాంతం ఎన్టీఆర్ ఉంటాడు, ఇక ఆ అయిదురోజులు సంపూ చేసే సందడితో బిగ్ బాస్ హౌస్ కళకళలాడిపోతుంది, టీఆర్పీ మోత మోగిపోతుంది అని అంతా ఆశపడ్డారు. కాని అనుకున్నది ఒకటి, అయ్యింది ఒకటి. సంపూ అలరించడం పక్కన పెడితే తుస్సుమన్నాడు. షోని బోర్ కొట్టించాడు. అసలు కెమెరా ముందు చెలరేగిపోయి డైలాగులు చెప్పే సంపూ బిగ్ బాస్ కెమెరా ముందు ఏంటి ఇలా అయిపోయాడు అంటూ అంతా ఆశ్చర్యపోయారు. ఎన్టీఆర్ ఏరికోరి మరి తెచ్చుకుంటే పూర్తిగా డిజపాయింట్ చేసాడు. నేను వెళ్ళిపోతా, వెళ్ళిపోతా అంతో ఏడవటం అటు ఉంచితే, నన్ను పంపించకపోతే బిగ్ బాస్ ఇంట్లోనే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు.

ఇక తప్పనిసరి పరిస్థితుల్లో సంపూని షోలోంచి పంపించేయడం జరిగింది. ఆ రకంగా ఎలిమినేషన్ ప్రాసెస్ ని చూడకుండానే వెళ్ళిపోయిన మొదటి బిగ్ బస్ కాంటెస్ట్టెంట్ గా రికార్డు పుస్తకాల్లోకి ఎక్కాడు సంపూ. కాని దీనివల్ల లక్షల్లో నష్టపోతాడు. బిగ్ బాస్ అలాంటి ఇలాంటి షో కాదు. చాలా స్ట్రిక్ట్. మోపెడు రూల్స్ ఉంటాయి. అవి పాటించకపొతే న్యాయపరంగా కఠిన చర్యలే. మొన్న డ్రగ్స్ కేసులో ముమైత్ ఖాన్ సిట్ ముందు హాజరైతే, తన వెంటే నీడలా ఉన్నాడు బిగ్ బాస్ ప్రతినిధి. అంటే ఇంటి బయటకి వెళ్ళినా, బిగ్ బాస్ కంట్రోల్ లోనే ఉండాలి అన్నమాట. ఓరకంగా చెప్పాలంటే, ఆ 70 రోజులు వారి జీవితాలు వారివి కావు. ఏం చేయాలన్నా బిగ్ బాస్ అనుమతి కావాల్సిందే. మరి అలాంటి బిగ్ బాస్ రూల్స్ ఉల్లఘించిన సంపూర్నేష్ ని ఊరికే వదిలేస్తాడా ?