Sampoornesh out of Bigg Boss .. isn’t this for publicity ?

బిగ్ బాస్ మొదలవడానికి ముందు ప్రేక్షకుల్లో ఈ షో మీద పెద్దగా అంచనాలు లేవు. కాని పార్టిసిపెట్ చేయబోతున్న సెలబ్రిటీల లిస్టు బయటపెట్టగానే ఎదో ఆసక్తి. అందుకు ముఖ్య కారణం, ఆ లిస్టులో బర్నింగ్ స్టార్ సంపూర్నేష్ బాబు పేరు ఉండటమే. దాంతో ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు పెరిగాయి. తెరపై తెగ అలరించే సంపూ, బిగ్ బాస్ హౌజ్ లో చెలరేగిపోతాడని, పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తాడని ఆశించారు. వారు అంచనాలు మరింత పెరిగేలా, సంపూ బిగ్ బాస్ హౌజ్ కి తొలివారం కెప్టెన్ గా నియమించబడ్డాడు. దాంతో ఎంటర్టైన్మెంట్ కి కొదువ లేదు అనుకున్నారు అంతా. కాని అంతా రివర్స్ అయ్యింది. కెప్టెన్ గా నిరుత్సాహపరిచిన సంపూ, కెప్టెన్ పదవి కోల్పోయిన తరువాత ఆటగాడిగా కూడా నిరుత్సాహపరిచాడు. మధ్యలో “సన్నపు చార్జర్” అనే సెటైర్ ని, అమ్మాయిలకు ప్రపోజ్ చేసిన తీరుని మినహాయిస్తే, ఈ తొమ్మిది రోజులు సంపూ చాలా చప్పగా, డల్ గా కనిపించాడు.

అదికాకుండా తాను ఇంట్లో ఉండలేను అని, వెంటనే వెళ్ళిపోతాను అని, తన ఆరోగ్యం కూడా చెడిపోతుందని పలుమార్లు కంప్లయింట్ చేసాడు సంపూ. కాని బిగ్ బాస్ రూల్స్ ప్రకారం ఎలిమినేట్ అయితే తప్ప ఎవరు బయటకి వెళ్ళడానికి వీలు లేదు. కాని నిన్న సంపూ ఇంట్లో సృష్టించిన వీరంగం అలాంటిది ఇలాంటిది కాదు. ఇటు కోపంగా ఉంటూనే వెక్కి వెక్కి ఏడ్చేశాడు. దీంతో సంపూని ఇంట్లోంచి బయటకి పంపించేసారు ఆకస్మాత్తుగా. కాని కథ ఇక్కడితో ముగిసిపోలేదు. సంపూ మీద న్యాయపరమైన చర్యలు తీసుకుంటారు బిగ్ బాస్ మేకర్స్. ఎందుకంటే కాంట్రాక్ట్ సంతకం చేసేటప్పుడు, రూల్స్ ఉల్లంఘిస్తే న్యాయపరమైన చర్యలకు సిద్ధం అని పార్టిసిపెంట్స్ కాంట్రాక్ట్ పేపర్స్ మీద ఆల్రేడి సంతకం చేసి ఉంటారు.

ఇది పబ్లిక్ స్టంట్ అయితే కాదుగా, సంపూ నిజంగానే వెళ్ళిపోయాడా అని కొంతమంది అనుమానపడొచ్చు. కాని నిజంగానే వెళ్లిపోయినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. మరి సంపూ స్థానంలోకి ఎవరు వస్తారు ? వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎవరు ఇస్తారు ? ఈ ప్రశ్నలకు సమాధానాలు త్వరలోనే దొరుకుతాయి.