సమ్మోహనం మూవీ రివ్యూ     2018-06-15   03:17:53  IST  Raghu V

చిత్రం : సమ్మోహనం
బ్యానర్ : శ్రీదేవి ఎంటర్టైన్మెంట్
దర్శకత్వం : మోహనకృష్ణ ఇంద్రగంటి
నిర్మాతలు : శివలెంక కృష్ణప్రసాద్
సంగీతం : వివేక్ సాగర్
విడుదల తేది : జూన్ 15, 2018
నటీనటులు : సుధీర్ బాబు, అదితిరావు హైదరీ, నరేష్ తదితరులు

కథలోకి వెళితే :

విజయ్ (సుధీర్ బాబు) ఒక పెయింటర్‌. చిన్నపిల్లల పుస్తకాలపై ఇల్లుస్ట్రేషన్స్ వేస్తుంటాడు. ఇతనికి ఆర్ట్ మీద ఎంత ప్రేమ ఉందో, సాహిత్యం మీద ఎంతటి సదాభిప్రాయం ఉందో, సినిమాలపై పూర్తి భిన్నంగా చెడు అభిప్రాయం ఉంది. పచ్చిగా చెప్పాలంటే సినిమాలంటే పడదు. కాని అతని తండ్రి (నరేష్) కి మాత్రం సినిమాలంటే పిచ్చి. ఒక ఆర్టిస్ట్ కావాలని కలలు కనేవాడు. ఆ పిచ్చికి పరాకాష్ఠ ఓ సినిమా షూటింగ్ కోసం తన ఇంటిని అద్దెకివ్వడం. ఇక్కడే విజయ్ కి పరిచయం అవుతుంది సమీర (అదితి). తనొక స్టార్ హీరోయిన్. అమ్మాయికి తెలుగు రాదు కాబట్టి విజయ్ ని తెలుగు ట్యూటర్ గా పెడతారు. ఇలా వారి మొదలైన మాటలు ఎటువంటి మలుపులు తిరిగాయో, ఎలాంటి భావోద్వేగాలకి లోనయ్యాయో థియేటర్లలో చూడండి.

నటీనటుల నటన :

సుధీర్ బాబు పరిణీతి కలిగిన నటనని కనబర్చాడు. హాడావుడి లేకుండా, అతికి వెళ్ళకుండా, సెటిల్డ్ గా అభినయించాడు. టెర్రస్ సన్నివేశం, ఇంటర్వల్ లో సబ్టిల్ గా పెట్టిన హావాభావాలు బాగా పండాయి. అదితి రావు మరోసారి తాను ఎంత మంచి నటో చూపించింది. చాలా సహజంగా, తెలుగు వచ్చిరాని స్టార్ హీరోయిన్ పాత్రకి అతికినట్టుగా సరిపోయింది. నరేష్ పాత్ర సినిమాకి హైలెట్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కరలేదు. చాలాకాలం తరువాత సీనియర్ నరేష్ లో ఒకప్పటి నరేష్ కనిపించాడు. సపోర్టింగ్ క్యాస్ట్ మంచి సపోర్ట్ ని అందించారు‌.