మోదీకి మొగుడు రాబోతున్నాడా ..? ప్రధాని ఆయనేనా ..?     2018-06-10   01:06:47  IST  Bhanu C

దేశంలో రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారిపోతున్నాయి. ఎన్నికల సమయం ఇంకా ఏడాది గడువు ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే పార్టీలు హడావుడి మొదలెట్టేశాయి. ఎవరికి వారు సొంత సర్వేలు చేయించుకుంటూ.. ఫలితం ఎలా ఉండబోతుందో అనే అంచనాలు సిద్దంచేసుకుంటున్నాయి. ఇక్కడే ఇప్పటివరకు ఎవరూ ఊహించని పరిణామం చోటు చేసుకుంది. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి పూర్తి మెజారిటీ రాకుండా… కాంగ్రెస్‌ కూడా ఆధిక్యం సాధించలేకపోతే ఏం జరుగుతుంది? ‘సంకీర్ణ సర్కారు’ తప్పని పరిస్థితే తలెత్తితే అందరికీ ఆమోదయోగ్యమైన ప్రధాని అభ్యర్థి ఎవరు? దీనికి ప్రస్తుతం వినిపిస్తున్న సమాధానం… మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ!

అసలు ఈ ప్రతిపాదనే ఎవరూ ఊహించనిది. కానీ దీనిపై శివసేన అధికార పత్రిక ‘సామ్నా’ శనివారం సంపాదకీయం రాసింది. ‘‘2019 ఎన్నికల్లో ఆధిక్యతను సాధించడంలో బీజేపీ విఫలమైతే… అందరికీ ఆమోదయోగ్యమైన అభ్యర్థిగా ప్రణబ్‌ ముఖర్జీ ప్రధాని కావొచ్చు’’ అంటూ అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇక… ‘కాంగ్రెస్‌ ముక్త్‌ భారత్‌’ అనే బీజేపీ నినాదంతో తాము ఏకీభవించడంలేదనే సందేశాన్ని ఆరెస్సెస్‌ పంపిందనే విశ్లేషణలు కూడా వెలువడుతున్నాయి. ప్రణబ్‌కు ఆహ్వానంలో సంకేతం ఇదేనని ఓ వార్తా చానల్‌ కధనం ప్రచారం చేసింది.