Roja Struggles for Minister Post

వైసీపీ ఫైర్‌బ్రాండ్, న‌గ‌రి ఎమ్మెల్యే ఆర్‌కె.రోజాకు ఆ పార్టీ అధినేత జ‌గ‌న్ పెద్ద అగ్నిప‌రీక్షే పెట్టిన‌ట్టు తెలుస్తోంది. రోజా ఇప్ప‌టికే చంద్ర‌బాబు అండ్ కోతో పాటు టీడీపీని ఓ రేంజ్‌లో టార్గెట్ చేస్తూ జ‌గ‌న్ వ‌ద్ద మంచి మార్కులు కొట్టేసేందుకు విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఈ క్ర‌మంలోనే ఆమె వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి పార్టీకి మ‌రింత క్రేజ్ తీసుకువ‌చ్చేందుకు కొంద‌రు కీల‌క నేత‌ల‌ను వైసీపీలోకి తీసుకువ‌చ్చేందుకు విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టు తెలుస్తోంది.

కొంద‌రు కీల‌క నేత‌ల‌ను పార్టీలోకి తీసుకువ‌చ్చే బాధ్య‌త‌ను జ‌గ‌న్ సైతం రోజాకే అప్ప‌గించిన‌ట్టు కూడా వైసీపీ ఇన్న‌ర్ వ‌ర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే ఆమె కొద్ది రోజుల క్రితం విశాఖ వెళ్లిన‌ప్పుడు గ‌తంలో ఆ పార్టీలో ప‌నిచేసిన సీనియ‌ర్ పొలిటిషీయ‌న్ దాడి వీర‌భ‌ద్ర‌రావుతో మీట్ అయ్యారు. దాడితో భేటీ గురించి మీడియా మిత్రులు ఆమెను ప్ర‌శ్నిస్తే..ఆ భేటీకి రాజ‌కీయాల‌కు సంబంధం లేద‌ని తేల్చేశారు.

విశాఖ జిల్లాలో పార్టీ చాలా బ‌ల‌హీనంగా ఉంది. ఈ క్ర‌మంలో సీనియ‌ర్ లీడ‌ర్ల లోటు అక్క‌డ తీవ్రంగా ఉంది. ఈ క్ర‌మంలోనే గ‌తంలో త‌మ పార్టీలో ప‌నిచేసిన దాడిని బుజ్జ‌గించి తిరిగి పార్టీలోకి తీసుకురావాల‌ని జ‌గ‌న్ ప్లాన్ వేశార‌ట‌. జ‌గ‌న్ ఆదేశాల మేర‌కే రోజా దాడిని క‌లిసిన‌ట్టు స‌మాచారం. ఇదే క్ర‌మంలో రోజా మ‌రో పెద్ద బాధ్య‌త‌ను కూడా భుజాల మీద వేసుకున్న‌ట్టు తెలుస్తోంది.

ఎన్టీఆర్ కుమార్తె, మాజీ కేంద్ర మంత్రి, ప్ర‌స్తుతం బీజేపీ నాయ‌కురాలిగా ఉన్న ద‌గ్గుపాటి పురందేశ్వ‌రిని సైతం వైసీపీలోకి తీసుకువ‌చ్చే బాధ్య‌త రోజా తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. ద‌గ్గుపాటి దంప‌తులు వైసీపీలోకి వ‌స్తే ఆ ఎఫెక్ట్ ప్ర‌కాశం జిల్లాతో పాటు రాష్ట్ర‌వ్యాప్తంగా గ‌ట్టిగా ఉంటుంది. ఈ క్ర‌మంలోనే ద‌గ్గుపాటి దంప‌తులు వైసీపీలోకి వెళ్లేందుకు సుముఖంగా లేక‌పోయినా..భారీ ఆఫ‌ర్ల‌తో రోజా మ‌ధ్య‌వ‌ర్తిత్వం ద్వారా వారిని పార్టీలోకి లాగేందుకు జ‌గ‌న్ విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టు తెలుస్తోంది.

ఇక ఇత‌ర పార్టీల సీనియ‌ర్ల‌ను వైసీపీలోకి లాగేసేందుకు విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తోన్న రోజా వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ ప్ర‌భుత్వం ఏర్ప‌డితే మంత్రి ప‌ద‌విపై క‌న్నేసింద‌ని…మ‌హిళా కోటాలో మంత్రి ప‌ద‌వి ఇస్తాన‌ని జ‌గ‌న్ ఆమెకు ఇప్ప‌టికే హామీ ఇచ్చార‌ని..అందుకే ఆయ‌న చెప్పిన‌ట్టు ఇప్పుడు రోజా ఇంత‌లా క‌ష్ట‌ప‌డుతోంద‌న్న గుస‌గుస‌లు వైసీపీలోనే విన‌వ‌స్తున్నాయి.